Minister Roja: ఏపీకి ఏం చేశావయ్యా..!
చంద్రబాబు పాలనలో లిక్కర్ ఫ్యాక్టరీలే పారిశ్రామిక ప్రగతి అని డబ్బా కొట్టారంటూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
దిశ, డైనమిక్ బ్యూరో : ‘విజన్ ఉంది, విస్తరాకుల కట్ట ఉంది అని ఒకాయన చెప్తాడు.. సెల్‌ఫోన్ కనిపెట్టాను.. కంప్యూటర్ కనిపెట్టానని అంటాడు తప్ప ఏపీకి ఏం చేశావయ్య అంటే మాత్రం చెప్పడానికి ఏం ఉండదు’ అని మంత్రి ఆర్‌కే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌తోపాటు మంత్రి ఆర్‌కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్ కే రోజా మాట్లాడుతూ విజన్ అంటే సీఎం జగన్‌ది అని చెప్పారు. వైఎస్ జగన్ మనసున్న నాయకుడు కాబట్టే.. అభివృద్ధితో పాటు.. ప్రజలకు కూడా ఆర్థికంగా సపోర్ట్‌గా ఉంటున్నారని తెలిపారు. పని మనుషులు, డ్రైవర్లతో ఎంవోయూలు చేసుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పాలనలో లిక్కర్ ఫ్యాక్టరీలే పారిశ్రామిక ప్రగతి అని డబ్బా కొట్టారంటూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం నిజమైన పారిశ్రామికవేత్తలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు మంత్రి తెలిపారు. సీఎం జగన్‌పై నమ్మకంతో ఏపీకి బడా పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని మంత్రి రోజా తెలిపారు. రాష్ట్రంలో జగన్ పాలన చూసి శభాష్ అంటున్నారని రోజా తెలిపారు. వైఎస్ జగన్ అంటే పేరు కాదు.. బ్రాండ్ అని చెప్పారు. రికార్డు సృష్టించాలన్నా, బద్దలు కొట్టాలన్నా ఆయనకే సాధ్యం. 175 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగనన్న వన్స్‌మోర్ అని జనం అంటున్నారని మంత్రి ఆర్ కే రోజా పేర్కొన్నారు.