Kadapa: చంద్రబాబును నమ్మితే రాష్ట్రం అధోగతిపాలే.. వైసీపీ ఎమ్మెల్యే శాపనార్ధాలు

ఇంటికో విమానం, మహిళకో నూరు కేజీల బంగారు ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు హామీలిచ్చినా ఆశ్చర్య పోవాల్సివ అవసరం లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ...

Update: 2023-06-07 13:04 GMT

దిశ, కడప: ఇంటికో విమానం, మహిళకో నూరు కేజీల బంగారు ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు హామీలిచ్చినా ఆశ్చర్య పోవాల్సివ అవసరం లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. అసత్యపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి, మ్యానిఫెస్టోను మడతపెట్టేసి రాష్ర్టాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబును నమ్మితే రాష్ర్ట ప్రజలందరూ అధోగతి పాలు కావడం తధ్యమని జోస్యం చెప్పారు. వై.ఎస్.ఆర్.సి.పి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవుడిచ్చిన వరం వల్లనో, పిల్లను ఇచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు వల్లనో ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన చంద్రబాబు పద్నాలుగున్నర సంవత్సరాలు పాలన చేసి ప్రజలకు మేలు చేయని ముఖ్యమంత్రిగా నిలిచి పోయారని విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వా మ్యానిఫెస్టోను మూలన పడేశారన్నారు. కొండంత చేస్తామని చెప్పి రవ్వంత అభివృద్ధి కూడా చేయలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలన కరువు కాటకాలతో సాగిందన్నారు. లంచాలు, కమీషన్ల కోసం బినామీ కంపెనీలను సృష్టించి వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారని భయపడి తన కొడుకు లోకేష్‌తో పాదయాత్ర చేయిస్తున్నారన్నారు.

మంగళగిరిలో రూ.130 కోట్లు ఖర్చు చేసినా గెలవలేని లోకేష్ మంత్రి పదవి వెలగబెట్టి ప్రజలకు ఏమి చేయలేక పోయారన్నారు. ఐ.టి శాఖా మంత్రిగా ఫైబర్ నెట్‌లో చేసిన అవినీతి అక్రమాలకు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఐ.టి శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ప్రతిశాఖలో లంచాలు, కమీషన్లు దండుకుంటూ ఆఖరికి దేవాలయాల్లో శానిటేషన్ కాంట్రాక్ట్ కూడా పొంది దోచుకున్నారన్నారు. లోకేష్ ఏనాడూ సర్పంచ్, వార్డు మెంబర్‌గా కూడా గెలువలేదన్నారు. వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాకే కుప్పంను రెవిన్యూ డివిజన్‌గా మార్చారని, నగర పంచాయితీ కూడా చేశారన్నారు. కుప్పం అభివృద్ధికి చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. 2019 ఎన్నికల్లో 51 శాతం ఓట్లతో 151 సీట్లు సాధించి చరిత్ర సృష్టించి ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా డి.పి.టి ద్వారా ప్రజల ఖాతాల్లోకి వేసిన ఘనత జగన్ దే అన్నారు.

2024లో కూడా 84 శాతం ఓట్లతో 175 స్థానాల్లో విజయ ఢంకా మోగించి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారని ఆయన జోస్యం చెప్పారు. పుత్తా నరసింహారెడ్డి 440 ఎకరాలు కబ్జా చేసి నిజమైన భూ బకాసురుడిగా నిలిచి పోయారన్నారు. కమలాపురం నియోజకవర్గం అభివృద్ధి చేసి ఉంటే ఇన్నిసార్లు ఎందుకు ఓడిపోతారని రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు.

Tags:    

Similar News