వివేకాహత్య కేసు అప్రూవర్ దస్తగిరికి బెయిల్ మంజూరు
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి బెయిల్ మంజూరు అయింది...
దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి బెయిల్ మంజూరు అయింది. దాడి కేసులో ఆయనకు కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళవారం సాయంత్రం కడప జిల్లా జైలు నుంచి దస్తగిరి విడుదల కానున్నారు. దాడి కేసులో దస్తగిరిపై మూడు నెలల క్రితం కడప జిల్లా వేముల పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి కూడా ఆయన జైలులో ఉన్నారు. దస్తగిరికి తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ కోర్డు ఆదేశించింది.
కాగా దస్తగిరిపై ఎర్రగుంట్ల పోలీసులు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో రెండు వారాల క్రితం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దాడి కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంతేకాదు ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశాడనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఎన్నికల వేళ దస్తగిరిపై తప్పుడు కేసులు పెడుతున్నారని... జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.