Kadapa: ఆరోగ్యశ్రీ సేవల్లో నిర్లక్ష్యం.. కలెక్టర్ సీరియస్
ఆరోగ్యశ్రీ సేవల్లో నిర్లక్ష్యాన్ని కడప కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు....
దిశ, కడప ప్రతినిధి: ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం అందించే సంకల్పంతో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ సేవల్లో నిర్లక్ష్యాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్య సేవలు అందించడంతోపాటు రోగుల పట్ల నిర్లక్ష్యం చేయడం, నాణ్యమైన వైద్య సేవలు అందించకపోవడం, సాధారణ పీహెచ్‌సీ వైద్య సేవలకు ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య సేవలకు తేడా కనిపించకపోవడం, సాదాసీదా వైద్యంతో ఆరోగ్యశ్రీ కేసులు చూసి సరిపెట్టడం లాంటి వాటిని ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా మంచి వైద్య సేవలు అందించకపోతే అలాంటి ఆసుపత్రుల గుర్తింపు కూడా రద్దు చేస్తామని ఆయన ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులను హెచ్చరించారు. చాలామంది రోగులు వైద్య సేవలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేట్లు సమాచారం. ఆ మేరకే జిల్లా కలెక్టర్ విజయరామరాజు జిల్లాలోని ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల వైద్యులతో ప్రత్యేక సమావేశం వైద్య సేవలను మెరుగ్గా అందించాలని, లేదంటే చర్యల గురువుతారని, ఆరోగ్యశ్రీ గుర్తింపు కూడా రద్దు చేస్తామని హెచ్చరించడం జరిగింది .
45 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు
వైయస్సార్ జిల్లాలో ప్రభుత్వం 45 వైద్యశాలలో ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తోంది. కడప రిమ్స్, ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రితో పాటు పులివెందుల, జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రులు ,బద్వేలు, చెన్నూరు, కమలాపురం, మైదుకూరు, పోరుమామిళ్ల, సిద్ధవటం, వేంపల్లి ఆసుపత్రులే కాకుండా జిల్లాలో 34 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. అయితే ఈ సేవల పై పర్యవేక్షణ తగినంత స్థాయిలో లేకపోవడం వల్లే పలు వైద్యశాలలో ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.
సొంత క్లినిక్‌ల పైనా చర్యలు
జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసే డాక్టర్లు సొంత క్లినిక్‌లు పెట్టుకొని వైద్య సేవలు అందించడంపై కూడా కలెక్టర్ దృష్టి పెట్టారు .ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తూ అక్కడ విధులు నిర్వహించాల్సిన సమయంలో సొంత క్లినిక్‌లో ఉండడం పట్ల చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఇలాంటి వారిపై నిఘా ఉంచి నివేదిక అందించాలని అసిస్టెంట్ కలెక్టర్‌ను ఆదేశించారు.