YS Viveka murder case: నెల రోజుల్లో డెడ్‌లైన్.. ఏం జరుగుతుందో?

దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

Update: 2023-03-31 15:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసు విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సీబీఐ డీఐజీ కేఆర్‌ చౌరాసియా పర్యవేక్షణలో కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను తొలగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిట్‌ అధికారుల జాబితాను సీబీఐ విడుదల చేసింది. విచారణ అధికారులుగా ఎస్పీ వికాస్ కుమార్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మ, ఇన్‌స్పెక్టర్ ఎస్ శ్రీమతి, ఇన్‌స్పెక్టర్ నవీన్ పునియా, సబ్ ఇన్‌స్పెక్టర్ అంకిత్ యాదవ్ వ్యవహరిస్తారని సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సిట్ బృందం డీఐజీ కేఆర్‌ చౌరాసియా నేతృత్వంలో పని చేస్తుందని.. సీబీఐ డీజీ ఆదేశాల మేరకు వీరంతా పని చేయాల్సి ఉంటుందని సీబీఐ స్పెషల్‌ క్రైం జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ విప్లవ్‌ కుమార్‌ చౌదరి ప్రకటనలో వెల్లడించారు.

ఏప్రిల్ 30డెడ్ లైన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ శుక్రవారం జరిగింది. ఈ విచారణకు సీబీఐ నలుగురు నిందితులను కోర్టుకు హాజరుపరిచింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ యాదవ్‌లను కోర్టులో హాజరుపరిచారు. ఇదే సమయంలో తాజా పరిస్ధితిపై సీబీఐ మెమో కూడా దాఖలు చేసింది. సీబీఐ స్పెషల్ పీపీ ఈ మెమోను దాఖలు చేశారు. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మారిన సిట్ ఈ కేసును దర్యాప్తు చేయబోతున్నట్లు తెలిపింది. మరోవైపు స్పెషల్ పీపీకి ఈ కేసు విచారణలో సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు న్యాయవాది హామీ ఇచ్చారు. ఇరు వాదనలు విన్న సీబీఐ కోర్టు విచారణణు వచ్చే నెల 28కి వాయిదా వేసింది. ఇకపోతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త సిట్ బృందం ఏప్రిల్ 30లోపు కేసు విచారణను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో రాబోయే నెల రోజుల్లో ఈ హత్య కేసులో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News