Kadapa: రైలు కింద పడి జంట ఆత్మహత్య
కడప రైల్వే స్టేషన్‌లో జంట ఆత్మహత్యకు పాల్పడింది...
దిశ, కడప: కడప రైల్వే స్టేషన్‌లో జంట ఆత్మహత్యకు పాల్పడింది. కడప రవీంద్రనగర్ చెందిన పాలకొండ రాయుడు (26), కడప నెహ్రూ నగర్ చెందిన చందనారెడ్డి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. చందన రెడ్డి ఒకటిన్నర సంవత్సర క్రితం భర్తను వదిలేసి ఏడు నెలలుగా పాలకొండరాయుడుతో ఉంటున్నారు. పాలకొండ రాయుడుకి చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించగా చిన్నాయన, పెదనాయనల వద్ద పెరుగుతూ డిప్లమో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఆరోగ్యశ్రీ ప్రొద్దుటూరు ఆర్వికే హాస్పిటల్ నందు విధులు నిర్వహిస్తున్నారు. చందనా రెడ్డి కూడా కడప సాంసంగ్ సర్వీస్ సెంటర్ నందు పని చేస్తూ ఉండగా ఏ విధంగా కలిశారో కానీ ఏడు నెలలుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు.
అయితే ఇటీవల వీరి మధ్య గొడవలు తలెత్తి చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో కూడా పంచాయితీ జరిగింది. దీంతో పోలీసులు కోర్టులో తేల్చుకోవాలంటూ సూచించారు.ఈ క్రమంలో ఈ జంట అనూహ్యంగా రైల్వేస్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం లేపింది. మృతుల సమాచారాన్ని వారి బంధువులకు తెలియజేయగా ప్రస్తుతానికి అబ్బాయి తరఫు బంధువులు రావడంతో విచారిస్తున్నట్లు రైల్వే ఎస్.ఐ రారాజు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారిస్తున్నారు.