Kadapa: రాష్ట్రానికి బీజేపీ ఒక శని గ్రహం: తులసిరెడ్డి

రాష్ట్రానికి బీజేపీ ఒక శని గ్రహంలా, వైసీపీ, టీడీపీ రాహుకేతువులుగా దాపురించాయని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నరెడ్డి తులసి రెడ్డి అన్నారు...

Update: 2023-05-20 13:57 GMT

దిశ, కడప: రాష్ట్రానికి బీజేపీ ఒక శని గ్రహంలా, వైసీపీ, టీడీపీ రాహుకేతువులుగా దాపురించాయని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నరెడ్డి తులసి రెడ్డి అన్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన చారిత్రిక ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణం లోని మాజీ ఎమ్మెల్యే కమలమ్మ స్వగృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా తులసిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం, మోసం చేసిందని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ, వైసీపీలను రాష్ట్ర పోరి మేల నుంచి తరిమికొట్టాలన్నారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపి పార్టీకి దాసోహం అయ్యాయని, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్‌గా బిజెపితో అంట కాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదాకు బీజేపీ పంగనామాలు పెట్టిందని, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్‌కు స్వస్తి పలికిందని, దుగరాజపట్నం ఓడరేవు ఊసే లేదని విమర్శించారు.

రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజికి తిలోదకాలు ఇచ్చిందన్నారు. పోలవరం ప్రశ్నార్ధకమైందని, విశాఖ రైల్వే జోన్ ప్రస్తావనే లేదని, విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ఊసే లేదన్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానికి ప్రతీక అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను అమ్మకానికి పెడుతోందని విమర్శించారు. ఆంధ్రా బ్యాంకును కాలగర్భంలో కలిపేసిందన్నారు. బి.జె.పి. దేశాన్ని అప్పుల భారత్ చేసిందని,1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు కేంద్ర ప్రభుత్వం 46 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయగా కేవలం 8 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం అదనంగా 109 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు. బి.జె.పి. దేశాన్ని అమ్మకానికి పెట్టిందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వే స్టేషన్లను అమ్మేస్తుందని ధ్వజమెత్తారు. ఉద్యోగ కల్పన పూర్తిగా నిలిచిపోయిందని, నిరుద్యోగం పెరిగిపోతోందని చెప్పారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, నిత్యవసర సరుకులు ధరలు సామాన్యునికి అందుబాటులో లేవని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని అమ్మకానికి పెడుతున్నారన్నారు. అభివృద్ధిని మరచి రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు. 

Tags:    

Similar News