ఐ ప్యాక్‌తో YCP రీ సర్వే.. అసంతృప్తులకు చెక్ పెట్టేందుకేనా..?
వైసీపీలో మార్పులు, చేర్పుల ప్రభావం అధిష్టానాన్ని బెంబేలెత్తిస్తోంది.
వైసీపీలో మార్పులు, చేర్పుల ప్రభావం అధిష్టానాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటిదాకా నాలుగు జాబితాలు విడుదల చేశారు. సీట్లు గల్లంతైన నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొందరు టీడీపీ, జనసేన పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. స్థానాలు మారిన నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఎన్నికల నోటిఫికేషన్ దాకా వేచి చూసి తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ పరిణామాలు వైసీపీ అధిష్టానంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అందుకే కొన్ని జిల్లాల్లో మరోసారి ఐ ప్యాక్ ద్వారా సర్వే చేయించి మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
దిశ, ఏపీ బ్యూరో : ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఐ ప్యాక్ ద్వారా మరోసారి సర్వే చేయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో టిక్కెట్ దక్కని, నియోజకవర్గాలు మారిన నేతలు గుంభనంగా ఉన్నారు. కొందరు టీడీపీ, జనసేన పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల పార్టీ విజయావకాశాలకు గండిపడే అవకాశముందని సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం చేపట్టిన మార్పులు, చేర్పుల వల్ల ఏఏ నియోజకవర్గాల్లో నష్టం వాటిల్లుతుందనే అంశాలపై మరోసారి సర్వే చేయించి నిర్ణయాలు తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఆనాడే కోరిన వేమిరెడ్డి..
నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇన్చార్జులను మార్చాలని గతంలోనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి అధిష్టానానికి సూచించారు. లేకుంటే విజయం సాధించలేమని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఒకానొక దశలో తాను ఎంపీగా బరిలోకి దిగాలంటే ఇన్చార్జులను మార్చాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. అప్పట్లో ఇన్చార్జులను మార్చేది లేదని సజ్జల తెగేసి చెప్పినట్లు సమాచారం. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని తప్పించి బొట్ల రామారావుకు ఇన్చార్జి ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత ఏమైందో రామారావుకు ఇంకా బాధ్యతలు ఇవ్వలేదు. అందువల్ల మరోసారి సర్వే చేయించి తగు నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. టికెట్ నిరాకరించడంతో గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
భగభగలాడుతున్న బాలినేని..
ప్రకాశం జిల్లా పార్టీలోనూ పెద్ద ఎత్తున అలజడి రేగుతోంది. సీఎం బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. తనకు తెలీకుండా పలు నియోజకవర్గాల్లో కొత్త వాళ్లకు అవకాశమివ్వడాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి రాజీనామా చేయడం పెద్ద విషయం కాదని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఒంగోలు సీటు ఆయనకు ఇస్తారో లేదో అధిష్టానం స్పష్టం చేయలేదు. అద్దంకి ఇన్చార్జిగా హనిమిరెడ్డిని వైవీ సుబ్బారెడ్డి సిఫారసుతో నియమించడంతో బాలినేని రగిలిపోతున్నారు. ఆ నియోజకవర్గంలో పార్టీ కీలక నేత అట్లా చినవెంకటరెడ్డి ఇటీవల టీడీపీ కండువా కప్పుకున్నారు. దీని వెనుక బాలినేని హస్తం ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
మాగుంట గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..
తొలుత ఒంగోలు ఎంపీగా మాగుంట తనయుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని బాలినేని ప్రకటించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి విషయం పట్టించుకోవద్దని సీఎం జగన్ చెప్పడంతో బాలినేని అలక వహించారు. మరోసారి సర్వే చేయించిన తర్వాత మాగుంటకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు పర్చూరు ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ అక్కడ నుంచి పోటీకి విముఖత చూపిస్తున్నారు. అది కమ్మ సామాజిక వర్గం పట్టున్న నియోజకవర్గం కావడంతో తనకు చీరాల కేటాయించాలని అడుగుతున్నారు. గిద్దలూరు సెగ్మెంట్ పై ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు.
రగులుతున్న కృష్ణా, గుంటూరు నేతలు..
ఇంకా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఈపాటికే రాజీనామా చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి జంప్ అవుతున్నారు. వసంత కృష్ణప్రసాద్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు రాజీనామాతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ – జనసేన కూటమి అభ్యర్థులెవరనేది తేలేదాకా ఇన్చార్జుల మార్పులు ఉంటాయని తెలుస్తోంది. పార్టీలో తలెత్తిన ఆందోళనలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇంకోసారి సర్వే చేయించాలని అధిష్టానం నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.