ఎవరి సీటు.. ఎవరికి వేటు..? వైసీపీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇన్​చార్జులు ఖరారైనట్లు తెలుస్తోంది.

Update: 2023-12-20 03:16 GMT

రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడుక్కుతున్నాయి. అటు ప్రతిపక్షాలు యువగళం ముగింపు సభ సాక్షిగా ఎన్నికల శంఖారావం పూరించనుండగా.. ఇటు అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలైంది. కొద్ది రోజుల క్రితం నియోజకవర్గాల ఇన్చార్జిలను మారుస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి 11 మందితో విడుదల చేసిన తొలి జాబితా సంచనం రేకెత్తించింది. ఇప్పుడు మరో జాబితా రెడీ అయినట్లు సమాచారం అందుతుండగా.. ఇందులో ఎవరికి సీటు, ఎవరికి వేటు అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో రాజకీయ కేంద్రాలకు నిలయమైన ఉమ్మడి కృష్ణా జిల్లాలో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.

దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇన్​చార్జులు ఖరారైనట్లు తెలుస్తోంది. 90 శాతం సిట్టింగులకు మార్పులు తప్పలేదు. విజయవాడ పార్లమెంటు ఇన్​చార్జిగా వల్లభనేని వంశీ మోహన్ ను నియమిస్తున్నట్లు సమాచారం. విజయవాడ తూర్పునకు సామినేని ఉదయభాను, విజయవాడ ‌పశ్చిమకు మేయర్ రాయన భాగ్యలక్ష్మికి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. మైలవరానికి జోగి రమేష్, నందిగామకు సీఎం చీఫ్​ సెక్యూరిటీ ఆఫీసర్​ జోషి మరదలు అమర్లపూడి కీర్తి‌ సౌజన్యను నియమిస్తారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. జగ్గయ్యపేట ఇన్​చార్జి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఖరారైనట్లు సమాచారం. తిరువూరు ఇన్​చార్జి బాధ్యతలు ఓ మాజీ ప్రభుత్వ అధికారిణి ఇవ్వొచ్చంటున్నారు. గన్నవరం ఇన్​చార్జిగా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, పెనమలూరు ఇన్​చార్జిగా దేవినేని అవినాష్ ను నియమించనున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

పోలవరం .. ఎవరికి వశం ?

దిశ, పోలవరం: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఎమ్మెల్యేల పని తీరు, పలు సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతోపాటు ఆశావాహులో ఒకరైన తెల్లం సూర్యచందర్రావు పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే బాలరాజు తనకు టికెట్ రానిపక్షంలో తన కుటుంబ సభ్యులకు ఒకరికి టికెట్ కేటాయించాలని కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం జగన్ మాత్రం గెలుపు గుర్రాలకే అభ్యర్థిత్వం అంటూ గత కొన్ని నెలలుగా స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, పలువురు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠ

సీఎం జగన్ పోలవరం నియోజకవర్గానికి ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, ప్రకటిస్తారోనని నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎవరికి టికెట్ కేటాయించినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఐ ప్యాక్ తోపాటు,‌ ఇతర సర్వేల ఆధారంగా ప్రస్తుత ఎమ్మెల్యేకి ఇస్తారా ? లేదా కొత్త వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రమోట్ చేసే ఆలోచన ఉందా ? అనేది ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News