స్కిల్ స్కామ్ పై గడప గడపకు వైసీపీ ప్రచారం?
చంద్రబాబు ప్రచారానికి రాకపోయినా కుప్పం ప్రజలకు ఆయనను అక్కున చేర్చుకున్నారు.
దిశ, కుప్పం: 1989 ఎన్నికల నుంచి వరుసగా ఏడుసార్లు గెలవడం ద్వారా చంద్రబాబు కుప్పం నియోజక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చారు. చంద్రబాబు ప్రచారానికి రాకపోయినా కుప్పం ప్రజలకు ఆయనను అక్కున చేర్చుకున్నారు. ఏ పరిస్థితుల్లో అయిననూ బాబుకు అండగా నిలిచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు కు చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా, ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా కుప్పంలో ఆధిపత్యం కోసం యత్నిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే 2014, 2019 వరుస ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓట్ల శాతం పెంచుకుంటూ వచ్చి గత నాలుగేళ్లలో అన్ని స్థానిక ఎన్నికల్లో పట్టు బిగించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి తీరుతామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ ను బలపరిచేందుకు రాజకీయ వ్యూహాలన్నీ పన్నుతున్నారు. కుప్పం ప్రాంత చిరకాల స్వప్నమైన కుప్పం బ్రాంచి కాలువను త్వరలో ప్రారంభించేందుకు యత్నిస్తున్నారు.
బాబు అరెస్టు అక్రమమేనని ప్రచారం
ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్ మెంట్ పనుల్లో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రాజకీయపరమైన కక్షతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని విమర్శిస్తూ వారిని విడుదల చేయాలనే డిమాండ్ తో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టు ను తప్పు పట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తుతోనే పోటీ చేస్తామని ప్రకటించారు. దాంతో ఆ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ న్యాయ పోరాటం చేస్తూనే, ఇతర పార్టీల మద్దతును కూడగట్టడంతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ లో ఎటువంటి అక్రమాలు జరగలేదని ప్రజలకు తెలియచేస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటూనే చంద్రబాబు అవినీతి కి పాల్పడ్డారని, అసెంబ్లీ నుంచి అన్ని రకాల సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం సాగిస్తోంది.
బాబు ప్రతిష్ట దెబ్బతీసేందుకు..
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై ఆధిపత్యం సాధించే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్కిల్ స్కామ్ గురించి ఇంటింటి ప్రచారం చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టింది. నియోజకవర్గ ప్రజలకు స్కిల్ స్కామ్ ఎలా జరిగింది.. అందులో చంద్రబాబు ఎలా ముద్దాయి అయ్యారో వివరంగా తెలియచేయడం ద్వారా ఆయన ప్రతిష్ట ను దెబ్బ తీయాలనుకుంటోంది. అది కూడా ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజాభిప్రాయం తెలుసుకునే క్రమంలోనే స్కిల్ స్కామ్ జరిగిన తీరును వివరించేందుకు నిర్ణయించుకుంది. మరి వైసీపీ వ్యూహం ఫలిస్తుందో ? కుప్పంలో రివర్స్ అవుతుందో వేచి చూడాలి.