కడపలో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంపై షర్మిల దృష్టి పెడతారా!

రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన వైయస్ షర్మిల రాష్ట్ర పార్టీని బలోపేతం చేయడం ఏమో గాని,

Update: 2024-06-09 03:13 GMT

దిశ ప్రతినిధి, కడప: రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన వైయస్ షర్మిల రాష్ట్ర పార్టీని బలోపేతం చేయడం ఏమో గాని, ఆమె సొంత జిల్లాలో అయినా పార్టీకి జవసత్వాలు నింపగలుగుతుందా? కడప జిల్లాలో హస్తవాసి సాధ్యమవుతుందా‌! రాష్ట్ర విభజనతో కోల్పోయిన మనుగడకు తిరిగి ప్రాణం పోస్తుందా! అన్న అంశాలపై రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఇప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఒక అవకాశం‌గా మారినా షర్మిల పోటీచేసిన కడప పార్లమెంటులోనే ఆమెకు డిపాజిట్లు ద్కక్కలేదు.

ఒక్కరికే కొన్ని ఓట్లు..

ఆమెతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థుల్లో కడప అసెంబ్లీ అభ్యర్థి అఫ్జల్ ఖాన్‌కు తప్ప ఎవరికీ సంతృప్తికరమైన ఓట్లు రాలేదు. దీంతో అంతో ఇంతో ఉన్న క్యాడర్ పూర్తిగా నిరాశకు గురైంది. ఇందుకు తోడు పార్టీలో మొదటి నుంచి జెండా మోస్తూ వస్తున్న కొందరు ఆమె వచ్చిన తర్వాత దూరం కావడం, బద్వేలిలో విజయం జ్యోతి లాగా ఒకరిద్దరు తప్ప ముఖ్య నేతలు ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఏ పార్టీకి అయినా ఎన్నికల సమయంలో పార్టీలో చేరికలకు అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఆ పార్టీ ఎన్నికలప్పుడు కూడా కొత్త చేరికలు కనిపించలేదు. అందునా వైఎస్ కూతురుగా, పీసీసీ అధ్యక్షురాలిగా చరిష్మా కలిగిన నేత అయివుండి కూడా ఆమె భరోసాతో ఎవరు పార్టీలో చేరలేక పోయారంటే ఆమె నాయకత్వం పైన, కాంగ్రెస్ పార్టీ భవితవ్యం పైనా నమ్మకం కుదరలేదా.. అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితులకు తోడు ఆమె పోటీ చేసిన కడప పార్లమెంట్‌లో డిపాజిట్ కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ మనుగడను ప్రశ్నిస్తోందని చెప్పవచ్చు.

1,37,079 ఓట్లకే పరిమితం..

కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ షర్మిల ఎన్నికల ఫలితాల్లో ధరావతు కోల్పోయారు. షర్మిల కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడం, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారానికి రావడంతో ఎన్నికలపై ఆమె తీవ్ర ప్రభావం చూపిస్తుందని అనుకున్నారు. కొందరైతే గెలుపు, లేదా రెండో స్థానంలో ఉంటుందని భావించారు. అందుకు తగ్గట్టుగానే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. అవినాష్ రెడ్డిపై విరుచుకు పడుతూ వివేకా హత్య పై నేరారోపణలు సంధించారు. వివేకానంద రెడ్డి కూతురు సునీత తో కలిసి ప్రచారం చేశారు. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు సంధించారు. ఈ నేపథ్యంలో కడప నుంచి ఆమెకు మంచి ఫలితాలు వస్తాయని భావించారు. అయితే అందుకు తగ్గట్టుగా ఓట్లు రాలేదు. కడప పార్లమెంట్‌లో 12, 97,360 ఓట్లు పోలుకాగా ఇందులో పోస్టల్ బ్యాలెట్ లను కలుపుకొని 1,370 79 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోలైన ఓట్ల శాతం లో 16.7 శాతం ఓట్లు వస్తేనే డిపాజిట్ దక్కినట్లు లెక్కిస్తారు. ఈ ప్రకారం రెండు లక్షల పదివేల ఓట్లు రావాల్సి ఉంది. అయితే కేవలం 1,37,079 ఓట్లకు మాత్రమే పరిమితం కావడంతో ఆమె డిపాజిట్ గల్లంతయిందని చెప్పవచ్చు.

అన్నా తమ్ముళ్ళను టార్గెట్ చేసినా!..

వైయస్ షర్మిల కడపలో పట్టునిలుపుకొనేందుకు, వైయస్ వారసురాలిగా తానూ నిలబడేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. పిసిసి అధ్యక్షురాలి హోదాలో పోటీ చేసిన ఆమె తప్పకుండా ఓట్లు రాబట్టుకునేందుకు కసరత్తు చేశారు. ఇప్పటికే వైఎస్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పట్టం కట్టారనడంలో సందేహం లేదు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కల్పించి, 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్థానం ఇచ్చారు. కడప జిల్లాకు వస్తే 2014లో రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను, 2019లో రెండు పార్లమెంటులు, 10 అసెంబ్లీ స్థానాలను ఆయనకు కట్టబెట్టి వైయస్ వారసత్వాన్ని చాటారు. ఈ పరిస్థితుల్లో జిల్లా రాజకీయాల్లోకి వైఎస్ తనయ గా ఎంట్రీ ఇచ్చిన షర్మిల అన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని, కడప ఎంపీగా నిలబడ్డ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారు.

అవినాష్ పై వివేకా హత్య ఆరోపణలు, అందుకు అన్న జగన్ అవినాష్ కు సహకరిస్తున్నారు అన్న విమర్శలు చేస్తూ, పనిలో పనిగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మించలేక పోయారు. సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదు అంటూ అన్న జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. అంటే ఒక విధంగా వారిని టార్గెట్ చేయడం ద్వారా వైఎస్ వారసత్వాన్ని, కడపలో కాంగ్రెస్ పట్టును నిలపాలనే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డి విమర్శించిన స్థాయిలో తెలుగుదేశం పార్టీపై ఘాటుగా విమర్శలు చేయలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె టిడిపి కంటే వైసీపీ పైనే గట్టిగా పోరాటం చేసేలా కనిపించారు. ఆమె ప్రచారంలో కూడా ప్రధాన పార్టీలకు దీటుగా కనిపించినా ఓటింగ్ వచ్చే లోపల డిపాజిట్ రాకపోవడం ఆమెను, కాంగ్రెస్ పార్టీని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని చెప్పాలి.

అమ్మచెప్పినా!

పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వైఎస్ షర్మిలను గెలిపించాలని, వైఎస్ అభిమానులు అందరూ సహకరించాలని స్వయాన షర్మిల తల్లి విజయమ్మ కూడా సందేశం ఇచ్చారు. దీంతో కొంత మేరకైనా షర్మిలకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించారు. అయితే ఆమె గెలుపు పక్కన పెడితే రెండో స్థానమైనా దక్కిన పరిస్థితి లేక పోగా కేవలం 137079 ఓట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. ఓవైపు అమ్మ విజయమ్మ సందేశం రూపంలో సహకరించడం, మరోవైపు హత్యకు గురైన చిన్నాన్న వివేకా కూతురు సునీత సహకారం అందించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, వీరిద్దరు కూడా న్యాయం చేయాలని ప్రజలను కోరడం ఇలాంటివన్నీ సెంటిమెంట్ రూపంలో పనిచేస్తాయని భావించినా అవేమీ పెద్దగా కనిపించకపోవడం చూస్తే షర్మిల కు కడప జిల్లాలో ఏ మేరకు ముందు అయినా ప్రజలు సానుకూలంగా మారి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తారన్నది సందేహంగానే చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

పాత వారిని పట్టించుకోలేదా !

వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా నియామకం కావడం, కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో జోష్ కనిపించింది. అయితే ఆమె పార్లమెంటు అభ్యర్థిగా పోరులో ఉన్నప్పుడు జిల్లాలోని పాత నాయకులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదన్న అభిప్రాయాలు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ అయిన తులసి రెడ్డి కి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం జరుగుతోంది. ఇదిలా ఉంటే సీనియర్లు గా ఉన్న ఇద్దరు నేతలు బయటకు వెళ్లారు. ముందు నుంచి పార్టీని నడిపిస్తూ, పార్టీ కార్యక్రమాలను చేపడుతూ వచ్చిన నాయకులు బయటకు వెళ్లడం, ఇందుకు తోడు కొత్త వారెవరు పార్టీలోకి చేరకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పటిష్టత ఎలా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఓడిపోవడంతో కడప పటిష్ట పై ఏమేరకు దృష్టి పెడతారు, జిల్లాలో పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యాచరణ చేపడతారు, ఎన్నికలప్పుడే పార్టీ బలోపేతం కాకపోతే ఇకమీదట ఆ పార్టీ వైపు ఎవరు చూస్తారు? కొత్తగా చేరికలు లేకపోతే పార్టీ బలోపేతం ఎలా సాధ్యమవుతుంది అన్న రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో షర్మిల జిల్లాలో వైఎస్ వారసత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు చేసే ప్రయత్నం ఏమిటో చూడాలి.


Similar News