కాకినాడ రూరల్‌లో పంతం నాన్నజీ పోటీలో ఉంటారా ?

పంతం నాన్నజీ సీనియర్ రాజకీయ వేత్త. ప్రస్తుతం కాకినాడ రూరల్ జనసేన ఇన్చార్జి. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

Update: 2023-08-19 02:56 GMT

ఒక వైపు రాష్ట్రంలో ముందస్తు అంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కధన రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. ఎక్కడ ఎవరిని తమ పార్టీ తరఫున బరిలోకి దింపాలి. ఎక్కడ ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే అంశాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పోటీ చేసే అంశం.. కాకినాడ రూరల్ అభ్యర్థిని ప్రభావితం చేయనుంది. ఇప్పటికే సీనియర్ రాజకీయ నేతగా పేరొందిన పంతం నాన్నజీ కాకినాడ రూరల్ లో జనసేన ఇన్చార్జిగా ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో నాన్నజీ టికెట్ పై కొంత సందిగ్ధత నెలకొన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదెలాగో చూద్దాం.

దిశ, ఉభయగోదావరి ప్రతినిధి: పంతం నాన్నజీ సీనియర్ రాజకీయ వేత్త. ప్రస్తుతం కాకినాడ రూరల్ జనసేన ఇన్చార్జి. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి జనసేన ఇన్చార్జి కాబట్టి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఇతనికి సీటు వస్తుందని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. కానీ తాజాగా పరిస్థితులను బట్టి సీటుపై గ్యారంటీ లేనట్లు అర్థమవుతోంది. గత ఎన్నికల్లో కాకినాడ రూరల్ జనసేన నుంచి పోటీ చేసి గెలుపు అంచుల వరకు వెళ్లిన నాన్నజీ.. ఈ సారి ఎన్నికల్లో సీటు వస్తే మాత్రం కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న రూరల్ లో విజయం తనదేనని నమ్ముతున్నారు. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమి ఆలోచిస్తున్నారో అనే దానిపై నాన్నజీ భవిష్యత్ ఆధారపడిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

పవన్ పోటీతో నాన్నజీకి డౌట్

కాకినాడ రూరల్ నియోజవకర్గంలో జనసేనకు మంచి పట్టు ఉంది. గత 2009లో ఇదే నియోజకవర్గం నుంచి కురసాల కన్నబాబు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. నియోజకవర్గంలో మెగా అభిమానులు అధికంగా ఉండటంతో ఇక్కడ జనసేన గెలుపు కూడా ఖాయమనే ప్రచారం సాగుతోంది. అయితే సీటు విషయానికొస్తే అనేక మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం ఉండడంతో నాయకులు డైలమాలో పడ్డారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ కు సమీప ప్రాంతమైన పిఠాపురంలో టీ టైం అధినేత ఉదయ్ ను ఇన్చార్జిగా నియమించారు. ఆయన హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కేడర్ ను కలిసి వెళుతుంటారు. అయితే ఉదయ్ పిఠాపురంలో పోటీ చేయబోరని, అతని స్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో దిగుతారనే ప్రచారం సాగుతోంది. ఒక వేళ పవన్ పోటీ చేస్తే పక్కనే ఉన్న కాకినాడ రూరల్ లో బీసీకి సీటు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పంతం నాన్నజీ కి అవకాశం లేకపోవచ్చనే అంచనా వేస్తున్నారు.

తగిన ప్రాధాన్యమిస్తారా ?

పిఠాపురంలో ఉదయ్ కి సీటు ఇచ్చినా కాకినాడ రూరల్ లో బీసీలకే చాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో నాన్నజీ తన భవితవ్యంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. నాన్నజీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ప్రయాణం చేశారు. అప్పట్లో హస్తకళల శాఖలో నామినేటడ్ పోస్టు కూడా ఇచ్చారు. తర్వాత జనసేనలోకి వచ్చారు. అప్పటి నుంచి పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో నాన్నజీకి సీటు లేకపోతే తగిన ప్రాధాన్యత కలిగిన పదవిని జనసేన అధినేత కట్టబెడతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రానున్న రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.


Similar News