చంద్రబాబుకు ఆ నేత రహస్య నివేదిక.. కావలి కాసేదెవరో?
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత ఇక్కడ తెలుగు తమ్ముళ్లలో నిరాశ అలముకొంది. ముసునూరులో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని
దిశ, నెల్లూరు సిటీ : నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత ఇక్కడ తెలుగు తమ్ముళ్లలో నిరాశ అలముకొంది. ముసునూరులో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేసినప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కండ్లగుంట మధుబాబునాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. ఆ తరువాత క్రియాశీలకంగా మారారు. చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే, బాలకృష్ణ నుంచి ప్రశంసలు సైతం అందుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి దూరంగా జరిగారు. తదనంతరం హడావుడిగా మాలేపాటి సుబ్బానాయుడిని పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈయన పార్టీని బలోపేతం చేయడంలో అంతగా శ్రద్ధ చూపలేకపోయారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల కోసం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరుపున పలువురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వారిలో గతంలో జనసేన నుంచి కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పసుపులేటి సుధాకర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త కావ్య క్రిష్ణారెడ్డి ఉన్నారు. నిన్నామొన్నటి వరకు పోటీకి విముఖత చూపిన మాలేపాటి సుబ్బానాయుడు కూడా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు.
ఏకపక్షంగా నివేదిక?
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా పేరున్న ఓ వ్యక్తి చంద్రబాబుకు రహస్య నివేదిక పంపినట్లుగా సమాచారం. అందులో తనకు అనునాయుడిగా ఉన్నట్లు మాలేపాటి సుబ్బానాయుడికి సరైన వ్యక్తి అని ఏకపక్షంగా అందులో పేర్కొన్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, సుబ్బానాయుడికి తన సొంత మండలం దగదర్తిలో కూడా పెద్దగా ప్రజామోదం లేదని తెలుస్తోంది. ఇటీవల నారా లోకేష్ పాదయాత్రకు జనసమీకరణ చేయడంలో ఆయన విఫలమయ్యారని విమర్శలున్నాయి. కాగా, కావ్య క్రిష్ణారెడ్డికి అసలు పలుకుబడి లేదని, ప్రజల్లో ఉండే వ్యక్తి కాదంటూ మరో తప్పుడు నివేదిక సిద్దం చేసి పంపినట్లు తెలిసింది. అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలతో కూడా ఆయన చంద్రబాబుకు లేఖలు పంపినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో పసుపులేటి సుధాకర్ జనసేన తరుపున పోటీ చేసి 10644 ఓట్లు సాధించారు. పరాజయం పాలైనా నియోజకవర్గంలో ప్రజలతో టచ్ లో ఉంటూ వస్తున్నారు. పదివేలకు పైగా ఓట్లు సాధించిన నాయకుడు ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఈయన పైనా కూడా సదరు సీనియర్ నేత తప్పుడు నివేదికలు పంపుతున్నట్లు సమాచారం. నియోజవకర్గంలో సరైన అభ్యర్థిత్వంపై తెలుగుదేశం అధిష్టానం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.