బెయిల్ వచ్చేనా?: చంద్రబాబుకు ఆకేసులో దక్కని ఊరట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎట్టకేలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

Update: 2023-10-11 10:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎట్టకేలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సీఐడీని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అంగళ్లు కేసులో రేపటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో చంద్రబాబుకు ఎట్టకేలకు హైకోర్టులో ఉపశమనం లభించినట్లైంది. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో మాత్రం చంద్రబాబు నాయుడుకు ఎలాంటి రిలీఫ్ లభించడం లేదు. విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా ఉపశమనం లభించడం లేదు. అటు హైకోర్టులో కూడా ఎలాంటి ఉపయోగం లభించలేదు. చివరకు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉంది. ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.అంగళ్లు, ఐఆర్ఆర్ కేసుల్లో చంద్రబాబు నాయుడుకు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడును జైలుపాల్జేసిన స్కిల్ స్కాం కేసు నుంచి మాత్రం ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

ఐఆర్ఆర్,అంగళ్లు కేసులో ఉపశమనం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు స్వీకరించింది. అయితే తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది దమ్మాలపాటి హైకోర్టును కోరారు. అనంతరం మధ్యాహ్నాం 12 గంటలకు హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని న్యాయస్థానానికి దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు సూచించింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ పెండింగ్‌లో ఉందని కోర్టుకు ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరో నలుగురిని చేర్చుతూ ఇప్పటికే సీఐడీ మెమో దాఖలు చేసిందని సీఐడీ తరఫు న్యాయవాది ఏఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వారితో కలిసి చంద్రబాబు నాయుడును విచారించాల్సి ఉంది అని తెలిపారు. అనంతరం హైకోర్టు లంచ్ బ్రేక్ ఇచ్చింది. లంచ్ బ్రేక్ విరామం అనంతరం వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను హైకోర్టు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే అంగళ్లు కేసులో ఈనెల 12 వరకు అరెస్టు, పీటీ వారెంట్‌ అడగబోమని హైకోర్టుకు సీఐడీ తెలిపింది. ఇక అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది.

ఈనెల 19 వరకు జైల్లోనే

ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన అమరావతి ఇన్నర్ రింగ్ రెడ్, స్కిల్ డవలప్మెంట్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్ స్కాం వంటి పలు కేసులలో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు ఈనెల 9న తీర్పు వెల్లడించింది. అన్ని పిటిషన్లను కొట్టేసింది. దీంతో ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేయగా దాన్ని తిరస్కరించింది. దీంతో బుధవారం చంద్రబాబు తరపు న్యాయవాదులు మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఐఆర్ఆర్, అంగళ్లు కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో ఏపీ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబును గత నెల 9న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈనెల 19 వరకు రిమాండ్‌ విధించిన సంగతతతి తెలిసిందే.

Tags:    

Similar News