పహల్గామ్ ఉగ్రవాద దాడి... మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రవాద దాడిని వైయస్ఆర్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు..

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రవాద దాడి(Pahalgam terrorist attack)ని వైయస్ఆర్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్(Former MLA Hafeez Khan) తీవ్రంగా ఖండించారు. అమాయక పర్యాటకులపై కిరాతకమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమైక్యతను దెబ్బతీసే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించరాదన్నారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేపట్టిన ఈ దాడిని దేశ శాంతి భద్రతలను భంగపరిచే చర్య అని మండిపడ్డారు. ఈ దాడికి మతాలు, రాజకీయాలు, లేదా ఏ ఇతర భేదాలను పైకి తీసుకోకుండా, దేశవ్యాప్తంగా అందరు ఐక్యంగా పోరాడాలని హఫీజ్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈ దాడిలో మరణించిన బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులకు తగిన న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దారుణ దాడికి తగిన శిక్షలు కల్పించేందుకు సంబంధిత అధికారులపై ఒత్తిడి పెంచాలని హఫీజ్ ఖాన్ వ్యాఖ్యానించారు.