Tirumala: ఆ విషయంలో నా పాత్ర లేదు: ఎమ్మెల్సీ సాబ్జీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం టికెట్లపై ఎమ్మెల్సీ సాబ్జీ అక్రమాలకు పాల్పడినట్లు వస్తున్న వార్తలకు సాబ్జి స్పందించారు....
దిశ, ఏలూరు ప్రతినిధి: తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం టికెట్లపై ఎమ్మెల్సీ సాబ్జీ అక్రమాలకు పాల్పడినట్లు వస్తున్న వార్తలకు సాబ్జి స్పందించారు. టికెట్లు వ్యవహారంలో తన పాత్ర ఏమీ లేదని, కావాలనే తనను కేసులో ఇరికించినట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నారన్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పారు. నకిలీ ఆధార్ దర్శనం సిఫార్సు లేఖలకు సంబంధించి తనపై వచ్చిన అభియోగం విషయంలో తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.
పేద విద్యార్థులకు తన జీతం అందిస్తున్నట్లు సాబ్జీ తెలిపారు. ఎమ్మెల్సీగా తనకు వస్తున్న లక్ష 75 వేల జీతభత్యాన్ని ప్రజా ఉద్యమానికే ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బెంగళూరుకు చెందిన తన స్నేహితుడు రవీంద్ర కొడుకు పుట్టినరోజు శుక్రవారం కావడంతో వారి కుటుంబ సమేతంగా ఆరుగురు తమతో పాటు వచ్చారని ఆయన తెలిపారు. వచ్చినవారు ఒరిజినల్ ఆధార్ కార్డుతోనే దర్శనానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. తిరుపతిలో వేణుగోపాల్ అనే వ్యక్తిని పీఆర్వోగా పెట్టుకున్నానని చెప్పారు. వేణుగోపాల్ బంధువులు హైదరాబాదు నుంచి దర్శనానికి వస్తున్నారంటే తనతో పాటు రావడానికి అంగీకరించినట్లు సాబ్జీ తెలిపారు.
అయితే వారు వద్ద ఉన్న ఆధార్ కార్డులు ఫేక్ అని తనకు తెలియదన్నారు. తనకు తెలిసిన వెంటనే స్వయంగా టిటిడి అధికారులకు సమాచారం అందించినట్లు సాబ్జి తెలిపారు. తన కారు డ్రైవర్‌కు ఫోన్ పే ద్వారా నగదు పంపించారన్నమాట అవస్తవమని కొట్టిపారేశారు. కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని వాపోయారు. డేగరాజు అనే వ్యక్తి తన కారు డ్రైవర్ కాదన్నారు. రెండు పేజీల్లో ఫిర్యాదుపై విజిలెన్స్ అధికారులు వారికి అనుకూలంగా రాసుకుని.. దానిపై ఆరుగురుతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని తెలిపారు. కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. ఈ కేసును తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారని, అయితే అక్కడ ఆ ఆరుగురు తనపై ఫిర్యాదు చేయలేదని చెప్పారని సాబ్జీ పేర్కొన్నారు.