కంటకాపల్లి బాధితులకు అండగా ఉంటాం : చెక్కులు అందజేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాకు సంబంధించి చెక్కులను మంత్రి బొత్స సత్యనారాయణ బాధితులకు అందజేశారు. రైలు ప్రమాద బాధితులకు జీవితాంతం ఉపాధి కల్పించేలా సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో సహాయం ప్రకటించారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. తొలుత ఆసుపత్రిలోని వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేసి అంతా త్వరగా ఆదుకోవాలని ఆకాంక్షించారు. ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
ప్రతీ ఒక్కరికీ సాయం
సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన మేరకు రైలు ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల వంతున 13 మంది మృతుల కుటుంబాలకు రూ.1.30 కోట్లు పరిహారంగా అందజేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన 30 మందికి రూ.1.29 కోట్లు పరిహారం అందిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారరు. ఈ ప్రమాదంలో గాయపడి, శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి రూ.10 లక్షలు సహాయం అందిస్తున్నట్టు సీఎం ప్రకటించారని ఇందులో భాగంగా ముగ్గురికి రూ.10 లక్షల వంతున రూ.30 లక్షలు అందజేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నెలరోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారని తెలిపారు. ఈ మేరకు నెలరోజులకు పైగా చికిత్స అవసరం అవుతుందని గుర్తించిన 15 మందికి రూ.75 లక్షలు పరిహారంగా అందజేసినట్లు తెలిపారు. నెల రోజుల్లోపల ఆసుపత్రిలో చికిత్స పూర్తిచేసుకొని డిశ్చార్చి అయ్యే వారికి రూ.2 లక్షలు పరిహారాన్ని ప్రకటించడం జరిగిందని ఇందులో భాగంగా 12 మందికి రూ.24 లక్షలు సహాయం అందించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ సురేశ్ బాబు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీసీహెచ్ఎస్ డా. గౌరీశంకర్, డీఎం అండ్ హెచ్‌వో డా.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.