AP News:హంద్రీనీవా కాలువకు నీటి విడుదల
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి హంద్రీనీవా కాలువకు నీటి విడుదలను జలవనరుల శాఖ అధికారులు చేపట్టారు.
దిశ, నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి హంద్రీనీవా కాలువకు నీటి విడుదలను జలవనరుల శాఖ అధికారులు చేపట్టారు. గురువారం ఉదయం 11.15 నిమిషాలకు జలవనరుల శాఖ అధికారులు 9 వ పంపు మోటార్ కు పూజలు నిర్వహించి ఒక పంపు ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. కొద్దిసేపటికి పంపు ట్రిప్ కావడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో మళ్ళీ 8వ,10వ మోటార్ ద్వారా నీటి విడుదల చేశారు. రెండు పంపుల ద్వారా హంద్రీనీవా కాలువకు 700 క్యూసెక్కుల నీటిని కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం జిల్లా ప్రజల సాగు తాగునీటి అవసరాల కోసం విడుదల చేశారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్ ఈ రాంగోపాల్, ఈ ఈ సురేష్ రెడ్డి, డిప్యూటీ సెక్షన్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ కలిమున్నీసా, హంద్రీనీవా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.