బ్రెయిన్ డెడ్ అయినా.. చిరంజీవే
అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను డాక్టర్ రాంబాబు అభినందించారు. విజయవంతంగా అవయవాలను సేకరించి తరలించిన వైద్య బృందానికి, గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలు వేగంగా చేరేందుకు సహకరించిన నగర పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చికు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దిశ, విశాఖపట్నం: తాను చనిపోతూ మరో నలుగురు ప్రాణాలు కాపాడారు విశాఖకు చెందిన వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 17వ తేదీన దువ్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వాసిరెడ్డి రామారావు (57) తలకు తీవ్రగాయాలు కావడంతో స్పృహ కోల్పోయారు. ఆయన్ను రక్షించడానికి రెండు రోజుల పాటు శ్రమించిన వైద్యులు సోమవారం బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఆ తర్వాత అవయవదానంపై వైద్య బృందం ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు అవగాహన కల్పించింది.. అవయవ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఈ విషయాన్ని జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కే.రాంబాబు దృష్టికి తీసుకువెళ్లారు. సేకరించిన అవయవాలను జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం నలుగురికి కేటాయించారు.
అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను డాక్టర్ రాంబాబు అభినందించారు. విజయవంతంగా అవయవాలను సేకరించి తరలించిన వైద్య బృందానికి, గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలు వేగంగా చేరేందుకు సహకరించిన నగర పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చికు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నలుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన రామారావు పార్ధివ దేహానికి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేందిర ప్రసాద్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రశంసా పత్రంతో పాటు అంతక్రియల నిమిత్తం పదివేల రూపాయలను కలెక్టర్ అందజేశారు.