పుల్వామా ఘటన అమరవీరులకు బీజేపీ నేతల నివాళులు
విశాఖ బీచ్ రోడ్డులో పుల్వామా ఘటన అమరవీరులకు బీజేపీ నేతల నివాళులు అర్పించారు.
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద పుల్వామా దాడిలో అమరులైన వీర జవానులకు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. సరిగ్గా నాలుగేళ్ళ క్రితం 2019 ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడిందని, ఈ దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు విడిచారని అన్నారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి మాట్లాడుతూ.. పుల్వామా దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై సర్జికల్ దాడులు చేయించి, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో తిష్టవేసిన ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసిందని ఆ దాడుల్లో బాలకోట్‌లోని జైషే మహ్మద్ స్థావరం కూడా నామరూపాల్లేకుండా పోయిందని, ఈ వైమానిక దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అన్నారు.