విశాఖకు ఓ ‘హైడ్రా’ అవసరం...!
చెరువులు, గెడ్డల కబ్జాలను తొలగిస్తూ హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘హైడ్రా’ విశాఖపట్నానికి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: చెరువులు, గెడ్డల కబ్జాలను తొలగిస్తూ హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టార్ మేనేజ్‌మెంట్ (హైడ్రా) వంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరమైన విశాఖపట్నానికి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా 1980లో చెరువులు ఎలా వున్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయో గుర్తించి, సమగ్ర వివరాలను సేకరించి కబ్జాలను తొలగించి చెరువులు, గెడ్డలను పునరుద్ధరించడం హైడ్రా కర్తవ్యం. సంచలన ఐపీఎస్ అధికారిగా పేరొందిన ఏవీ రంగనాధ్ కమిషనర్‌గా హైడ్రా చేపట్టిన కబ్జాల తొలగింపులకు అక్కడ మంచి స్పందన వస్తోంది.
విశాఖలో అడుగడుగునా కబ్జాలే
హైదరాబాద్‌ను కబ్జాలనుంచి విముక్తి చేస్తూ, వాటర్ బాడీలను పరిరక్షిస్తున్న హైడ్రా వంటి వ్యవస్థ కోసం విశాఖ ఎదురుచూస్తోంది. ప్రభుత్వాలు మారినా, ప్రజా ప్రతినిధులు మారినా, అధికారులు కొత్త వారు వచ్చినా విశాఖలో కబ్జాలు మాత్రం ఆగడం లేదు. రెవిన్యూ, జీవీఎంసీ, ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కు అవుతున్న స్ధానిక రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు డాక్యుమెంట్లతో, తప్పుడు సర్వే నెంబర్లతో, సర్వే నెంబర్ల సబ్ డివిజన్ ల పేరిట పెద్ద ఎత్తున చెరువులు, గెడ్డలను కబ్జా చేసేస్తున్నారు. ఈ కారణంగా అకాల వర్షాల సమయంలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతూ సమస్యలు తెచ్చిపెడుతోంది. విశాఖ లో చిన్నపాటి వర్షం పడ్డా ఏ ఇబ్బంది లేకుండా సహజసిద్ధంగా సముద్రంలో కలిసే ఏర్పాటు ఉన్నప్పటికీ సమస్యలు తలెత్తడానికి కారణం కబ్జాలే.
నగరంలో గెడ్డలు.. శివార్లలో చెరువులు కబ్జా
విశాఖ నగరంలో గెడ్డలు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. గెడ్డలను ఆక్రమించి ఇళ్లు, అపార్ట్మెంట్లు, వ్యాపార సముదాయాలు పెద్ద ఎత్తున నిర్మించారు. ఈ కారణంగా జీవీఎంసీ ముందు జాగ్రత్త చర్యగా వర్షాకాలానికి ముందు గెడ్డలను శుభ్రం చేసేపనులు చేయడం కూడా కష్టంగా మారుతోంది. పలు చోట్ల గెడ్డ కబ్జాలను తొలగించడానికి వెళుతున్న అధికారులు, సిబ్బందిని కార్పొరేటర్లు, స్థానిక నాయకులే అడ్డుకొంటున్నారు. వేల సంఖ్యలో భవనాల పునాదులు, ప్రహరీ గోడలు గెడ్డ స్థలాల్లోనే వున్నాయి. ఇక నగర శివారులోని విశాఖ రూరల్, ఆనందపురం, భీమిలి, పెందుర్తి, పెడ గంట్యాడ, సబ్బవరం, పరవాడ, అనకాపల్లి మండలాల్లో పలు చెరువులు కబ్జాకు గురయ్యాయి. చెరువు గట్ల మీద పాకలు వేయడం ఆ తరువాత వాటిని చెరువు గర్బం వరకూ విస్తరింపజేసి అమ్ముకోవడం అనవాయితీగా మారింది. నగరం విస్తరించిన కారణంగా గతంలో మాదిరిగా వ్యవసాయ భూములు లేకపోవడంతో చెరువులను కబ్జా చేసినా అడిగేవారే లేకుండా పోయారు.
జన్మభూమి స్ఫూర్తి ఏదీ?
గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చెరువుల కబ్జాలను తొలగించి వాటిల్లో పూడిక తీత కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. 2014 లో ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ‘నీరు చెట్టూ ’ అనే కార్యక్రమాన్ని చేపట్టి వందల కోట్లతో చెరువుల్లో పూడికలు తీశారు. చెరువులను పరిరక్షించారు. అయితే, గ్రామీణ ప్రాంతాలకే ఈ కార్యక్రమం పరిమితం కావడంతో నగరాలు, పట్టణాలలో చెరువు కబ్జాలకు అడ్డే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం హైడ్రా స్పూర్తితో రాష్ర్టంలో కూడా నగరాలు, పట్టణాల్లోని నీటి వనరులను పరిరక్షించాలన్న డిమాండ్ ఊపందుకొంటుంది.