Ap Floods: రైతులకు భారీ నష్టం.. కేంద్రమంత్రి సంచలన హామీ
ఏపీలో రైతులకు కలిగిన నష్టంపై కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్ చలించిపోయారు...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలో కురిసిన కుంభవృష్టి వర్షం.. రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. వరదల దెబ్బకు వందల, వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొద్ది రోజుల్లో కొతకు వచ్చిన పంట సైతం నీళ్ల పాలయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. నీళ్లలో కొట్టుకుపోయిన పంటలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే రాష్ట్రంలో జరిగిన వరద నష్టంపై కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ ఫుల్ ఫోకస్ పెట్టారు. వరద ప్రాంతాల్లో తిరుగుతూ పంటలను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు కొల్లు, అచ్చెన్న, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి శుక్రవారం కృష్ణా జిల్లా కేసరపల్లిలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు.
ఈ సందర్భంగా శివరాజ్ చౌహాన్ మాట్లాడుతూ తాను స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చానని తెలిపారు. రైతు కష్టం తనకు తెలసన్నారు. వారం రోజులుగా పంటలన్నీ నీటిలో ఉన్నాయన్నారు. వరి, మొక్కజొన్న, అరటి, కంది వంటి పంటలకు అపార నష్టం జరిగిందన్నారు. నాలుగైదు రోజుల్లో వరి పంట చేతికొచ్చే సమయంలో రైతులను వరదలు తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. రోజులతరబడి నీళ్లు ఉండటంతో పంటంతా కుళ్లిపోయిందని తెలిపారు. ఈ వరదలు కౌలు రైతులను కూడా విడిచిపెట్టలేదని, వారికి మరింత నష్టాన్ని కలిగించాయన్నారు. పంట నష్టం వచ్చినా కౌలు రైతులు మాత్రం కౌలు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని కేంద్రం అండగా ఉంటుందని శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.