Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇక ఆ ఇబ్బందులుండవ్

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు టీటీడీ ఈఓ శ్యామలారావు గుడ్ న్యూస్ చెప్పారు. ఒక్కరోజులోనే స్వామివారి దర్శనం, వాహనసేవలో పాల్గొనేలా భక్తులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

Update: 2024-10-02 04:42 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు (అక్టోబర్ 3) రాత్రి అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. సాధారణ రోజుల్లో కంటే.. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు మరింత అధికంగా తిరుమలకు వెళ్తుంటారు. పైగా దసరా సెలవులు కూడా ఈ సమయంలో కలిసివస్తాయి. పిల్లలతో సహా కుటుంబమంతా.. ఆ వెంకన్న దేవుడిని దర్శించుకునేందుకు పయనమవుతారు. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక్కరోజులోనే దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేశామని, అదేరోజున వాహనసేవల్లో కూడా పాల్గొనవచ్చని తెలిపారు టీటీడీ ఈఓ శ్యామలరావు.

గరుడసేవకు 2 లక్షల మంది

వీఐపీ సిఫార్సు దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే దర్శనాలు ఉంటాయని, గరుడసేవ రోజున (అక్టోబర్ 8) వీఐపీ దర్శనాలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు మరోమారు చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాల నిమిత్తం ఆన్లైన్లో 1.32 లక్షల టికెట్లను ఇచ్చినట్లు తెలిపారు. అలాగే నేరుగా సర్వదర్శనానికి వచ్చేవారికి రోజుకు 24 వేల దర్శనం టికెట్లను ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. వాహన సేవల్లో రోజుకు 80 వేల మంది భక్తులు పాల్గొంటారని, గరుడవాహన సేవ రోజున లక్షమంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. సుమారు 2 లక్షల మంది ప్రత్యక్షంగా గరడవాహన సేవను వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తులకు అన్న, పానీయాల కొరత లేకుండా చూస్తామన్నారు.

కరెంట్ బుకింగ్ కే ప్రాధాన్యం

ప్రస్తుతం తిరుమలలో 6200 గదులు అందుబాటులో ఉండగా.. వీలైనంత వరకూ కరెంట్ బుకింగ్ ద్వారానే గదులను కేటాయిస్తామని తెలిపారు. వీఐపీలకు మరో 1300 గదులు ప్రత్యేకంగా ఉన్నట్లు చెప్పారు. సుమారు 40 వేల మందికి వసతి ఏర్పాట్లను చేసినట్లు టీటీడీ ఈఓ శ్యామలారావు పేర్కొన్నారు. అలాగే విష్ణునివాసం, శ్రీనివాసం, పద్మావతి, ఇతర వసతి గృహాలలోనూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకూ తరిగొండ వెంగమాంబ సత్రంలో నిత్యాన్నదానం జరుగుతుందని, మిగతా ప్రాంతాల్లోనూ అన్నదానం నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. 


Similar News