Trending: ఆ రాష్ట్రంలో అమీబా టెర్రర్.. మెదడును తినేస్తూ ప్రాణాలు తీస్తున్న వైనం
మెదడును తినేస్తున్న ఓ అమీబా అందరిలోనూ టెర్రర్ పుట్టిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: మెదడును తినేస్తున్న ఓ అమీబా అందరిలోనూ టెర్రర్ పుట్టిస్తోంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఆ వ్యాధి బారిన పడి ముగ్గురు ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా కలుషిత నీటితో స్నానం చేస్తే.. అమీబా ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి బాడీలోకి ప్రవేశిస్తుంది. అనంతరం అది మెల్లగా మెదడుపై దాడి చేస్తుందని వైద్యులు వెల్లడించారు. అమిబా వైరస్ అంటువ్యాధి కాదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని డాక్టర్లు తెలిపారు. అయితే కేరళ రాష్ట్రంలో వైద్య శాఖ అమీబా ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకునేందుకు మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.
అయితే, అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరిన వెంటనే, మెదడు కణజాలాన్ని నాశనం చేసే ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) అనే మెదడు ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతోంది. అమీబా బ్రెయిన్‌లోకి వెళ్లాక వ్యాధి లక్షణాలు సాధారణంగా ఐదు రోజుల తర్వాత ప్రారంభం అవుతాయి. కానీ, అవి బయటపడటానికి 1 నుంచి 12 రోజుల వరకు సమయం పడుతుంది. వ్యాధి సోకిన వారిలో తలనొప్పి, జ్వరం, వికారం లేదా వాంతులు అవుతాయి. రెండో దశలో మెడ బిగుసుకుపోవడం, గందరగోళం, వ్యక్తులు, పరిసరాలపై శ్రద్ధ లేకపోవడం, మూర్ఛలు, భ్రాంతులు కలిగి చివరకు కోమా వరకు దారితీస్తాయి. 18 రోజుల్లో మరణం కూడా సంభవించవచ్చని వైద్యులు వెల్లడించారు.