విషాదం: తిరగబడ్డ కళాయి.. ఏడేళ్ల చిన్నారి సజీవ దహనం
ఏడేళ్ల కూతురిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కుమార్తెను భవిష్యత్ కోసం తల్లిదండ్రులు సంతలో తినుబండారాలు అమ్ముతూ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ఏడేళ్ల కూతురిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కుమార్తెను భవిష్యత్ కోసం తల్లిదండ్రులు సంతలో తినుబండారాలు అమ్ముతూ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే సంతలో అమ్మే తినుబండారాలను ఇంటి దగ్గర తయారు చేస్తుండగా కళాయి తిరగబడి నూనె పొయ్యిలో పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఏడేళ్ళ చిన్నారి సజీవ దహనమైంది. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది.చింతపల్లి మండలం అన్నవరంనకు చెందిన కుటుంబం సంతలో తిను బండారాలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో సోమవారం కూడా సంతకు వెళ్లేందుకు తినుబండారాలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో నూనెతో ఉన్న కళాయి తిరగబడింది. ఒక్కసారిగా పొయ్యిలోకి తిరగబడటంతో మంటలు చెలరేగాయి. పూరిగుడిసె కావడంతో క్షణాల్లో ఇల్లు కాలిపోయింది. ఆ మంటల్లో ఏడేళ్ల చిన్నారి నిత్య చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి సజీవ దహనం అయ్యింది. నిత్య సజీవదహనంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమార్తెను ఎంతో గారాబంగా పెంచుకుంటున్నామని.. ఆమె భవిష్యత్ కోసం ఎంతో కష్టపడుతున్నామని చివరికి ఆమె లేకపోతే ఇక తామెందుకు అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇకపోతే నిత్య రెండో తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.