Nara Bhuvaneshwari : ఏపీలో భువనేశ్వరి బస్సు యాత్రకు ముహూర్తం ఫిక్స్.. టీడీపీలో జోష్ పెంచేలా ప్లాన్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2023-09-30 05:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. న్యాయపరంగా కేసులను ఎలా ఎదుర్కొవాలనే దానిపై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని లోకేష్ భావించారు. కానీ సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడటం, ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనేది అంచనా వేయలేకపోతుండటంతో పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. పాదయాత్రలో బిజీగా ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు జరపడం వీలు కాదనే భావనతో చివరి నిమిషంలో పాదయాత్రను వాయిదా వేసుకున్నారు.

చంద్రబాబు జైల్లో ఉండటం, లోకేష్ ఢిల్లీకే పరిమితం కావడంతో కష్ట సమయంలో టీడీపీని నడిపించే నాయకుడు కరువయ్యారు. దీంతో టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోగా.. యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నేరుగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రంగంలోకి దిగబోతున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేంతవరకు టీడీపీని ఆమె నడిపించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా భువనేశ్వరి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బస్సు యాత్రకు తెరవెనుక ఏర్పాట్లు జరుగుతుండగా.. అక్టోబర్ మొదటివారంలోనే స్టార్ట్ చేయనున్నారని సమాచారం.

ఈ బస్సు యాత్రకు 'మేలుకో తెలుగోడా' అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ యాత్ర వారం రోజుల పాటు జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను బస్సు యాత్ర ద్వారా భువనేశ్వరి టచ్ చేసేలా రూట్‌మ్యాప్ సిద్దమవుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారనే విషయాన్ని ఆమె ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా టీడీపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ బస్సు యాత్రతో ఏపీ రాజకీయాల్లోకి భువనేశ్వరి అడుగుపెట్టనున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ చేపడుతున్న ర్యాలీలలో భువనేశ్వరి పాల్గొని అక్రమంగా జైల్లో పెట్టారంటూ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా వైసీపీపై భువనేశ్వరి విమర్శల దాడి మరింత పెంచడమే కాకుండా చంద్రబాబు అరెస్ట్‌తో డైలమాలో ఉన్న టీడీపీ క్యాడర్‌ యాక్టివ్ అయ్యేలా ప్రయత్నాలు చేయనున్నారు.

More News : నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్.. తెలుగు యువత నేతలతో కీలక భేటీ

Read More Latest News updates From Andhra Pradesh 

Tags:    

Similar News