Three Cylinders: ఉచిత గ్యాస్ సిలిండర్లపై బిగ్ అప్డేట్..

ఏపీలో కూటమీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తుంది.

Update: 2024-09-29 05:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4వేలకు పెంచిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మరో పథకం అమలు వైపు కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో 1.55కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకం అమలు చేయాలని భావిస్తే ఏడాదికి రూ.3,640 కోట్లు ఖర్చవుతుంది. అదే సమయంలో దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్ తీసుకున్న 75 లక్షల మందికి అమలు చేస్తే ఏడాదికి రూ.1,763 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు తేల్చారు. ఇక పూర్తి వివరాలతో పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర రూ.825.50(విజయవాడలో)ఉంది. ఏడాదికి మూడు సిలిండర్ల లెక్కన ప్రస్తుతమున్న వంట గ్యాస్ ధర ప్రకారం చూస్తే ఒక్కో కుటుంబానికి రూ.2,476.50 ప్రయోజనం లభిస్తుంది. కాగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల కిందకు కేంద్రం మారిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.585 కోట్ల భారం తగ్గుతుంది. ఐదేళ్ళకు రూ.2,925 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుంది.


Similar News