AP Assembly: మాకు అరకొర సమాధానం ఇస్తున్నారు.. ఆన్సర్ ప్లీజ్..!
ఏపీ అసెంబ్లీలో చిత్ర పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు లేకపోవడంతో ప్రజల సమస్యలకు సంబంధించి అధికార సభ్యులే ప్రశ్నలు వేయడం, వాటికి మంత్రులు సమాధానం ఇవ్వడం జరుగుతుంది

- ఏపీ అసెంబ్లీలో విచిత్ర పరిస్థితి
- అధికారపక్ష సభ్యులే విపక్ష సభ్యులై..
- అవునండి .. కాదండి అని మాత్రమే చెబుతున్నారు..
- అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు
- ఎమ్మెల్యే కూన రవి ఆవేదన
- సరి చేస్తామని చెప్పిన డిప్యూటీ స్పీకర్ రఘురామ
దిశ డైనమిక్ బ్యూరో: ఏపీ అసెంబ్లీలో చిత్ర పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు లేకపోవడంతో ప్రజల సమస్యలకు సంబంధించి అధికార సభ్యులే ప్రశ్నలు వేయడం, వాటికి మంత్రులు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ అదే కొనసాగుతోంది. అయితే తాము వేసిన ప్రశ్నలకు అరకొర సమాధానం వస్తుందని కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు (TDP MLA) పలుమార్లు ప్రస్తావించారు. ఈరోజు సమావేశంలో కూడా ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇదే అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు.
పీఏసీలు, సొసైటీలు, డీసీబీలలో జరిగిన అవకతవకలపై తాను వేసిన ప్రశ్నకు సరైన సమాధానం లేదని కూన రవికుమార్ అన్నారు. ప్రభుత్వం సభ్యులకి సమాధానం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. పూర్తి సమాచారం ఇవ్వకుండా సభను అధికార యంత్రాంగం తప్పుదోవ పట్టించటం సరికాదన్నారు. దీనికి మంత్రి అచ్చెనాయుడు కలుగజేసుకొని సమాధానం ఇచ్చారు. తాను ఇచ్చిన సమాధాన పత్రాలను కూన రవి పూర్తిగా చదివి మాట్లాడితే బాగుంటుంది అన్నారు. వెంటనే రవి మాట్లాడుతూ సభలో సభ్యులకు సమాధానాలు అందడం లేదన్నారు. ఎవరికైనా అంటే ఏమో ఏ సభ్యుడైన చెప్పాలని కోరారు. అవునండి కాదండి.. అనే సమాధానాలు తప్ప మిగిలినవి తమకు రావడం లేదన్నారు. దీనికి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు (Raghurama) సమాధానం ఇస్తూ భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకుంటామన్నారు. తాను మాట్లాడింది మంత్రిని ఉద్దేశించి కాదని.. ప్రభుత్వ ఉద్యోగులు, అసెంబ్లీ సెక్రటేరియట్ తప్పనిసరిగా సభ్యులకు సమాధానం పంపించాలని కోరారు. ఇది సెక్రటేరియట్ వైఫల్యమైన అని, ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. సమాధానాలను వాట్సప్ ద్వారానే పంపించి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు.