AP News:‘కూటమిలో ఎలాంటి కుమ్ములాటలు లేవు’.. మంత్రి కీలక వ్యాఖ్యలు

కూటమి పార్టీల్లో ఎలాంటి కుమ్ములాటలు లేవని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు.

Update: 2024-11-05 08:59 GMT

దిశ ప్రతినిధి,కాకినాడ: కూటమి పార్టీల్లో ఎలాంటి కుమ్ములాటలు లేవని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా తొలిసారి జిల్లాలో కూటమిలోని మూడు పార్టీల సమన్వయ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏ పార్టీలో అయినా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండటం సహజమన్నారు. అలాంటిది మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయని, కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సీఎం ఆదేశాల ప్రకారం మూడు పార్టీల సమన్వయంతో పాటు ప్రజా సమస్యలపై ఇన్చార్జి మంత్రిగా ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. జగన్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయటమే కాక రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి జగన్ వెళ్ళిపోయాడని విమర్శించారు.

స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వాడేసుకున్నాడని, అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు.తన అనుభవంతో సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఖజానా ఖాళీ అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూన్నామన్నారు. మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తామని, అమరావతిపై 2014లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం కూడా పార్లమెంట్ లో సమాధానం ఇచ్చిందన్నారు. ప్రతినెలా మూడుసార్లు ఇన్చార్జి మంత్రిగా కాకినాడ జిల్లాకు వస్తానని, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలు పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు పై దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు. ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారులతో సమీక్ష నిర్వహించలేదు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇన్చార్జులు తమ నియోజకవర్గం అభివృద్ధిపైనే ఎక్కువగా చర్చించారు.


Similar News