Godavari:పెరుగుతున్న గోదావరి ఉధృతి..భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక!

గోదావరి వరద ఉధృతి తీవ్రమవుతోంది. ఎగువన తెలంగాణలోని భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం 5 గంటలకు 48.6 అడుగులకు వరద నీటి మట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.

Update: 2024-07-25 13:54 GMT

దిశ,ఏలూరు:గోదావరి వరద ఉధృతి తీవ్రమవుతోంది. ఎగువన తెలంగాణలోని భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం 5 గంటలకు 48.6 అడుగులకు వరద నీటి మట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. భద్రాచలం నుంచి వరద నీరు దిగువకు ప్రవహించడంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటి మట్టం పెరిగింది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం 22,987 మీటర్లకు చేరుకుందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 33.100 మీటర్లకు చేరింది. దిగువన 24.700 మీటర్లు గా నమోదైంది.

దీంతో ప్రాజెక్టు స్పిల్ వే 48 గేట్లు ఎత్తివేసి 10,95,616 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇఇ మల్లిఖార్జునరావు, డిఇ మాధవరావు తెలిపారు కాగా భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద గురువారం సాయంత్రం 5 గంటలకు 48.6 అడుగులకు చేరుకున్నందన లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు పోలవరం మండల కేంద్రంలో తహశీల్దారు కార్యాలయానికి వెళ్ళే రోడ్డు మార్గానికి ఇరువైపులా ఉన్న పంట పొలాల్లో కొండవాగుల వరదతో నిండి ఉండటంతో పంట పొలాలు మునిగాయి.

గోదావరి నీటిమట్టం తగ్గిపోవడం, కడమ్మ స్లూయిజ్ గేట్లకు గోదావరి వరద జలాలు తన్నిపెట్టి ఉండడంతో గేట్లు పూర్తిగా మూసుకుపోయి కొండవాగుల జలాలతో తహసిల్దార్ కార్యాలయంకు వెళ్ళే దారిలో ఇరువైపుల ఉన్న సుమారు రెండు వేల ఎకరాలు వరినాట్లు నీటమునిగాయి. గత ఐదు రోజులుగా పంటపొలాలు నీటిలో ఉండడం వలన వరినాట్లు కుళ్లిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి యేటా ఇదే పరిస్థితి ఎదురవుతుందని రైతులు నష్టపోతున్నారని అధికారులు స్పందించి పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఉపయోగించినట్లుగా పెద్దమోటారుని కడెమ్మ స్లూయిజ్ వద్ద ఏర్పాటు చేస్తే, మోటారుతో వరద జలాలను తోడి గోదావరిలోకి పంపడం వలన పంట పొలాలు నీట మునిగే అవకాశాలుండవని చెబుతున్నారు.


Similar News