బోస్ భవితవ్యం ఏంటి? రాజ్యసభలో ఉంటారా రాజీనామా చేస్తారా?

పిల్లి సుభాష్ చంద్ర బోస్... సీనియర్ వైసీపీ నాయకుడు పూర్వం దివంగత రాజ శేఖర్‌రెడ్డితో అత్యంత సన్నిహితం గల ఈయన వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా పేరుంది.

Update: 2024-09-01 01:57 GMT

దిశ, కోనసీమ ప్రతినిధి: పిల్లి సుభాష్ చంద్ర బోస్ సీనియర్ వైసీపీ నాయకుడు పూర్వం దివంగత రాజ శేఖర్‌రెడ్డితో అత్యంత సన్నిహితం గల ఈయన వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా పేరుంది. జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తొలి నాళ్లలోనే కాంగ్రెస్ పార్టీకి, మంత్రిపదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధమైన నాయకుడు. అంతటి నమ్మిన బంటు వైసీపీని వీడతారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. తన కోసం కాకపోయినా తన కుమారుడి భవిష్యతు కోసమైనా పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు తన తోటి సహచరులు కూడా పార్టీని వీడటంతో ఇక బోస్‌కు ఆ పరిస్థితి తప్పదని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై బోస్ రాజమండ్రిలో వివరణ ఇచ్చినా, చాలా మంది పార్టీ మార్పు అనివార్యం అంటున్నారు.

బోస్‌కి అసంతృప్తి..

వాస్తవానికి బోస్‌కు జగన్ విధానాలు అట్టే నచ్చవు. గతంలో కొన్ని విషయాల్లో జగన్‌ను విభేదించారు. రాజశేఖర్ రెడ్డి ని ఎంతగానో అభిమానించే బోస్ ఆ స్థాయిలో జగన్ అంటే ఇష్టపడరు. గత ఎన్నికలకు ముందు తన కుమారుడు సీటు కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను కూడా వ్యతిరేకించారు. తన కుమారుడికి సీటు ఇవ్వకపోతే పార్టీని వీడతానని నాడు అన్నారు. తర్వాత జరిగిన పరిణామాల్లో బోస్ తన కుమారుడికి సీటు దక్కించుకొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సుభాష్ చేతిలో ఓడిపోయారు. అయితే బోస్ మాత్రం పైకి పార్టీ మారనని అంటున్నా.. లోలోన మధన పడుతున్నట్లు సమాచారం.

కుమారుడి కోసం తప్పదా..?

బోస్ కుమారుడు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. వాస్తవానికి బోస్ ముందు ఉన్న పెద్ద టార్గెట్ తన కుమారుడికి ఏదో ఒక పదవి ఇప్పించాలని. కానీ వైసీపీలో ఉంటే అది సాధ్యపడదు. ఈ నేపథ్యంలో బోస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ పదవికి తన కుమారుడిని పోటీలో నిలిపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడల్సిందే.


Similar News