volunteers: అయోమయం.. ప్రశ్నార్థకంగా వాలంటీర్ల భవితవ్యం
పరిపాలనా సౌలభ్యం కోసం గత వైసీపీ ప్రభుత్వం తాత్కాలికంగా నియమించిన వలంటీర్ల పరిస్థితి గందరగోళంగా మారింది.
దిశ ప్రతినిధి, కర్నూలు: పరిపాలనా సౌలభ్యం కోసం గత వైసీపీ ప్రభుత్వం తాత్కాలికంగా నియమించిన వలంటీర్ల పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడం, తమ ప్రభుత్వంలో కూడా వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, అందుకు వేతనం రూ.10 వేలు ఇస్తామని ప్రకటన చేయడంతో వలంటీర్ల ఆశలకు రెక్కలొచ్చాయి. ఎన్నికల నిబంధనల మేరకు వలంటీర్లను సచివాలయ విధులకు దూరం పెట్టింది.
దీంతో వైసీపీ నేతలు కొందరితో బలవంతంగా రాజీనామా చేయించగా మరి కొందరు అలాగే ఉండిపోయారు. వైసీపీకి చెందిన వలంటీర్లు ప్రస్తుతం తమను ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగించాలని, వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మంత్రులు, ఎమ్మెల్యేల ఎదుట ఏకరువు పెట్టడం కొసమెరుపు.
నామమాత్రపు జీతంతో..
గత వైసీపీ ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున రాష్ర్ట వ్యాప్తంగా 2,66,158 మంది వలంటీర్లను నియమించింది. వీరికి నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇచ్చి వీరితో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పనులు చేయించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చింది. వలంటీర్లు అంతా వైసీపీ పార్టీకి చెందిన వారు కావడం, అలాగే ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాకపోవడంతో వీరిని ఎన్నికల సంఘం సచివాలయ సేవలకు దూరంగా పెట్టింది. వలంటీర్లు అంతా వైసీపీకి చెందిన వారు కావడంతో జగన్ గెలుపు కోసం ప్రచారం చేసేందుకు చాలా మంది రాజీనామా చేశారు.
98 వేల మందితో రాజీనామా చేయించారు..
రాష్ర్ట వ్యాప్తంగా 2,66,158 మంది వలంటీర్లు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ హోదాల్లో ఉన్న నేతలు 98,549 మంది వలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించి వారిని వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో వాడుకు న్నారు. రాజీనామా చేసిన వలంటీర్లు కూడా వైసీపీ ప్రచారాల్లో చురుకుగా పాల్గొన్నారు. కొన్ని చోట్లా వారే ఏజెంట్లుగా ఉన్నారు. కొంత మంది వలంటీర్లు రాజీనామా చేయలేదు.
రాజీనామా చేసినా వలంటీర్లు, చేయని వలంటీర్లు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ తామే వలంటీర్లుగా కొనసాగవచ్చనే ధీమాలో ఉండిపోయారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ టీడీపీ అధికారంలోకి రావడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
మోసపోయామంటూ మొర..
టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, ఒక్కో వలంటీర్ కు రూ.10 వేలు చెల్లిస్తామని ప్రకటన చేయడంతో తమనే వలంటీర్లుగా కొనసాగించాలని, తాము వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోయామంటూ మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టీడీపీ గెలుపు కోసం పని చేసిన తమును కాదని మళ్లీ వైసీపీకి చెందిన వలంటీర్లకు ఇవ్వరనే ధీమాలో టీడీపీ నేతలున్నారు.
ఇక పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం పింఛన్ దారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేస్తోంది. అకౌంట్ బుక్ లేని వారికి మాత్రం పంచాయతి కార్యదర్శులు నేరుగా పింఛన్లు అందజేస్తున్నారు.