క్యాసినోతో మహిళలను అంగటి బొమ్మగా మార్చారు.. టీడీపీ మహిళా నేత అనిత

Update: 2022-01-31 09:01 GMT

దిశ, ఏపీ బ్యూరో : 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళా ద్రోహి. ఇలాంటి జగన్ పాలనకు చరమగీతం పాడాలి. ఈ నారీ సంకల్ప దీక్ష నుంచే చరమగీతం పాడేందుకు అడుగు పడాలి. రాబోయే కాలంలో మహిళలపై అఘాయిత్యాలు, దాడులు చేస్తే సహించం. మద్య నిషేధం అనే బూటకపు హామీతో మహిళలను వంచించి, నేడు జే-బ్రాండులతో ప్రజల కష్టాన్ని మద్యం పేరుతో లాగేసి, వేల కోట్లు తన జేబులో వేసుకున్న జగన్ రెడ్డి మోసాన్ని, మహిళలు గళమెత్తి ప్రశ్నించడానికే నేటి'నారీ సంకల్పదీక్ష'' అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అని అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం ఉదయం వంగలపూడి అనిత నారీ సంకల్ప దీక్షకు పూనుకున్నారు.

ఈ దీక్షలో సుమారు 100 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. అలాగే ఇరు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మహిళా నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చేతకాని, దద్దమ్మ, సైకో ముఖ్యమంత్రి పాలన వల్లే ఇన్ని ఇబ్బందులు. ఉదయం లేవగానే ఏ వార్త వినాల్సి వస్తోందనే భయంతో అందరూ మహిళలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు అని ఆరోపించారు.

మహిళల ఎమోషన్స్‌తో ఆడుకున్నారు

'వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ధైర్యంగా గుండెలపై చేయి వేసుకొని నిద్రపోలేని దుస్థితి.  సైకో సీఎం పాలనలో మహిళలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి మహిళ బయటకొచ్చి హక్కుల కోసం పోరాటం చేయాలి. మనల్ని మనం రక్షించుకోవాలి. అవినీతి జగన్ పాలనకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో దీక్షకు వచ్చిన ప్రతిమహిళకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నాతో పాటు స్టేట్ కమిటీలో ఉన్న వారిలో సుమారు 100 మంది వరకు దీక్షలో పాల్గొన్నారు. జగన్ రెడ్డి మహిళలకు అండగా నిలబడతాడేమోనని రెండున్నరేళ్లుగా వేచి చూశాం.

ఉపయోగం లేకుండా పోయింది. అందుకే సమర భేరి మోగించాం. పాదయాత్ర సమయంలో మహిళలకు ముద్దులు పెడుతూ తల నిమిరాడు. ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేశాడు. మన ఎమోషన్స్‌తో ఆడుకున్నాడు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తాను, అక్కచెల్లెమ్మల కళ్లలో ఆనందం చూస్తానని నమ్మబలికాడు. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పాడు. మడమ తిప్పాడు. కరెంటు షాకు కొట్టేలా ధరలు ఉండాలని లిక్కర్ రేట్లు పెంచానన్నాడు. అన్నీ అబద్ధాలే. తన జేబులు, బినామీల జేబులు నింపుకుంటున్నాడు. నాశిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్నాడు.

ఇంటిని, వంటిని, రాష్ట్రాన్ని గుల్ల చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? కరోనా విపత్తులో మద్యం షాపులు ఓపెన్ చేసింది దేశం మొత్తంలో జగన్ రెడ్డే. మద్యం షాపుల దగ్గర చదువులు చెప్పే టీచర్లను కాపలా పెట్టాడు. నకిలీ బ్రాండ్లు తాగుతున్న వైసీపీ నేతలు పిచ్చి వాగుడు వాగుతున్నారు. వైసీపీ నేతల తీరు, వారు మాట్లాడే మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది' అని వంగలపూడి అనిత నిలదీశారు.


వైసీపీ పాలనలో 1500 మందిపై అత్యాచారం

'విజయవాడలో బాలిక ఆత్మహత్య చేసుకుంటే అధికారంలో ఉండీ నిందితుణ్ణి శిక్షించకపోగా మంత్రులు మొదలు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేస్తారా?  ఆడబిడ్డ జీవితాన్ని కూడా రాజకీయం చేయడానికి సిగ్గుందా? రెండున్నరేళ్లలో 1500కు పైగా అత్యాచార ఘటనలు నమోదైతే వైసీపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. అందువల్లే ప్రతిరోజూ ఒక ఆడబిడ్డపై అత్యాచారమో, లైంగిక దాడో జరిగింది. రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్న సుచరిత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మహిళకు అన్యాయం జరిగితే రోడ్డు మీదకు వచ్చి మాట్లాడలేని దుస్థితిలో హోం మంత్రి, మహిళా కమిషన్, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు' అని వంగలపూడి అనిత ప్రశ్నించారు.

ఎమ్మెల్యే రోజాపై సెటైర్లు 

'నా గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం లేదు.. జగనన్న అని కొట్టుకుంటోంది అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఏమ్మా.. రాష్ట్రంలో అన్యాయమైపోతున్న ఆడబిడ్డలు, కన్నపేగును పోగుట్టుకున్న తల్లుల గర్భశోకం నీకు వినిపించడం లేదా? అమరావతి మహిళా రైతులను బూటు కాళ్లతో పోలీసులు తన్నితే ఆ ఎమ్మెల్యే గుండె జగన్ జగన్ అనే కొట్టుకుంది. గన్ కంటే జగన్ ముందువస్తాడన్నారు. మరి ఆ గన్నుకు తుప్పుపట్టిపోయిందా? విజయవాడలో బాలిక ఆత్మహత్య చేసుకుంటే రాజకీయం చేయడానికి వైసీపీ నేతలు బయటకు వచ్చారు.

నరసరావుపేటలో అనూష, విజయవాడలో తేజస్విని, పులివెందులలో నాగమ్మ, విశాఖలో లక్ష్మి, అనంతపురంలో స్నేహలత ఇలా  ఎందరో ఆడబిడ్డలు చనిపోయినప్పుడు వెలగని కొవ్వుత్తు ఇవాళ వెలిగిందా? మరి రెండున్నరేళ్లుగా జరిగిన అత్యాచార ఘటనలపై ఎందుకు స్పందించలేదు? వైసీపీ పేటీఎమ్ కుక్కలు మొరుగుతున్నారు. నిండుసభలో చంద్రబాబు సతీమణిపైనే దిగజారి మాట్లాడిన కాలకేయులు వైసీపీ నేతలు, మంత్రులు. వీరు మన గురించీ నీచంగా మాట్లాడతారు. అయితే మనం భయపడకుండా ఇలాంటి ఇడియట్స్‌ని ఉక్కు సంకల్పంతో కాళ్ల కింద చెప్పుల్లా నలిపేయాలి' అని వంగలపూడి అనిత హెచ్చరించారు. 

డ్వాక్రా మహిళల సొమ్మును కాజేసిన జగన్

'నిత్యావసరాల ధరలు ఎంత పెంచేశారో చూస్తున్నాం. పచారీ కొట్టుకు వెళితే రూ. 500 క్షణాల్లో ఆవిరైపోతున్నాయి. ఒక బిడ్డ అడిగిన ఇష్టమైన వంటకం కూడా వండలేని పరిస్థితులు తల్లులకు కల్పించారు. ధరలు తగ్గించాలని, ఆడబిడ్డలపై అఘాయిత్యాలను అరికట్టాలని, మద్యపాన నిషేదం అమలు చేయాలని మేము దీక్ష చేస్తున్నాం. చంద్రబాబు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు. ఆడవాళ్లకు ఆర్థిక స్వావలంబన అవసరం లేదనే రీతిన తుగ్లక్ సీఎం వ్యవహరిస్తున్నాడు.

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదు అనుకున్నట్టే ఉంది జగన్ రెడ్డి తీరు. డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న సొమ్మును కాజేస్తున్నాడు. ఇంతకుముందు రూ. 50,000 ఉంటే రూ. 5 లక్షలలోన్ వచ్చేది. ఇప్పుడు గ్రూప్ తరపున రూ. 2 లక్షలు ఉంటేనే రూ. 5 లక్షల లోన్ ఇవ్వడానికి బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారు. చంద్రబాబు డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి గురించే ఆలోచించారు. దశాబ్ధాలుగా మహిళలు దాచుకున్న పొదుపు సొమ్మును తీసుకోవాలన్నా కూడా పర్మిషన్లు తీసుకోవాలట. ఎంతటి దౌర్భాగ్యమో చూడండి. దానిమీద చేస్తున్నాం దీక్ష'అని వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.


ఆడవాళ్లు బయటకు వస్తే బూడిద కూడా మిగలదు

'ఓటీఎస్ అంట. వన్ టైమ్ సీఎం ఆర్డర్ వేయగానే వన్ టైం సెటిల్‌మెంట్ అంటున్నారు. ఎప్పుడో ఎవరో కట్టిన ఇళ్లకు ఇతగాడు రిజిస్ట్రేషన్ చేయడమేంటి? రూ. 10,000 వసూలు చేయడమేంటి? వసూల్ రాజా దేనిమీదైనా పన్ను వేస్తాడు. మనం బయట పడేసిన చెత్తమీద పన్ను వేశాడు. బాత్రూమ్ మీద , ఇంటి మీద, ఎప్పుడో కట్టిన ఇంటికీ వసూల్ రాజా పన్నులు వేస్తాడు. ఎందుకు కట్టాలి పన్ను. నీ తాత సొమ్మేమైనా ఇచ్చావా? అభయహస్తం కింద ఉన్న 2 వేల కోట్ల రూపాయిలను దోచేశాడు. మనం దాచుకున్న కష్టాన్ని దోచేసేవాడిని దొంగ అనాలా వద్దా?  మహిళలు ఆలోచన చేయాలి.

వైసీపీ పాలనలో ఆడబిడ్డపై అఘాయిత్యాలు కామన్ అయిపోయాయి. క్యాసినో కల్చర్ తీసుకొచ్చి మహిళలతో అర్ధనగ్న ప్రదర్శలు చేయిస్తూ అంగటి బొమ్మగా మార్చేశారు. వైసీపీ నేతలకు సిగ్గుందా? వీళ్లు ఆడవాళ్లకు పుట్టిన వాళ్లేనా? మహిళలతో వ్యాపారం చేస్తున్నారంటే వైసీపీ నేతలు మనుషులా, పశువులా, కాలకేయులా అనేది ప్రజానీకమే తేల్చుకోవాలి. కిరోసిన్ పోసుకుంటానని మంత్రి అంటాడా? రా బయటకు రా.. మా ఆడవాళ్లు వచ్చారంటే బూడిద కూడా మిగలదు. పెట్టుకోండి కేసులు. తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్న రోజే భయం పోయింది. ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాలని నిర్ణయించుకున్నప్పుడే భయం పోయింది. మా వెనుక చంద్రబాబు అనే శక్తి ఉంది' అని వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు.

తుగ్లక్ రెడ్డి పాలనకు చరమ గీతం పాడాల్సిందే 

'ఆడబిడ్డలకు గౌరవం ఇవ్వడంలో, ఆడబిడ్డలను అక్కున చేర్చుకోవడంలో టీడీపీ ఎంత ముందు ఉంటుందో ఇక్కడ పనిచేసి వెళ్లిన వారికి కూడా తెలుసు. ఇక్కడి నుంచి వెళ్లి ఎమ్మెల్యేలు అయినవారికి అక్కడ కుర్చీ కూడా లేదు. అదే మా చంద్రబాబు ఏం మాట్లాడతారో తెలుసా..ఏమ్మా అనితమ్మా అని మాట్లాడతారు. మాకు గౌరవం ఇచ్చి ఆయన గౌరవం పొందుతున్నారు. జగన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని ఏం చేశాడో చూశాం. తల్లిని, చెల్లిని గౌరవించలేని వాడు ఎవరిని గౌరవిస్తాడు. తుగ్లక్ రెడ్డి పాలనకు ఎంత త్వరగా చరమగీతం పాడితే అంత మంచిది. నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పుందేమో వైసీపీ నేతలు చెప్పగలరా? మన రాష్ట్ర భవిష్యత్తు, మన ఆడబిడ్డ , భరోసా కోసమే మేము సంకల్ప దీక్ష చేస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ సంకల్ప దీక్షకు మద్దతు తెలపాలి' అని వంగలపూడి అనిత కోరారు.

Tags:    

Similar News