అంబటి రాజీనామా.. సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు..
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా వాసి, ఇండియన్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరి పది రోజులకే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అంబటి రాజీనామా ఇష్యూ ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంలా మారింది. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. జగన్ గురించి పూర్తిగా తెలియకముందు ఆర్భాటంగా వైసీపీలో చేరి ఆ తర్వాత అసలు రూపం తెలియడంతో ఎన్నికలకంటే ముందే అంబటి బయటకు వచ్చేశారని దుమ్మెత్తు పోస్తున్నాయి. మరోవైపు వైసీపీ ఇంచార్జుల మార్పు నిర్ణయం కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టైంది. ఒక చోట చెల్లని కాసులు మరోచోట చెల్లుతాయా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
తాజాగా కృష్ణా జిల్లా తిరువూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ ఇంచార్జుల మార్పుపై ఆయన విమర్శలు చేశారు. ఒక నియోజకవర్గంలోని చెత్త పక్క నియోజకవర్గంలో బంగారం అవుతుందా అని ప్రశ్నించారు. అటు అంబటి రాయుడు అంశంపైనా ఆయన విమర్శలు కురిపించారు. అంబటిని తొలుత గుంటూరు పార్లమెంట్‌కు పంపుతామని సీఎం జగన్ మాట ఇచ్చి, ఆ తర్వాత తప్పారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవుతుందని ముందుగానే గమనించిన అంబటి ఆ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు చంద్రబాబు విమర్శించారు. రాజకీయాల్లోకి ఎన్నో ఆశలతో అంబటి వచ్చారని, జగన్ మాయలో పడి వైసీపీలో చేరారన్నారు. ఆ తర్వాత జగన్ నైజం అర్ధం చేసుకుని ఆ పార్టీకి గుడ్ బై చెప్పారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.