100 రోజుల్లో పరిష్కరిస్తా.. అంగన్వాడీలకు చంద్రబాబు కీలక హామీ
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అంగన్ వాడీ సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు..
దిశ, వెబ్ డెస్క్: అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అంగన్ వాడీ సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కుప్పం టూర్లో అంగన్వాడీ నిరసనలకు ఆయన మద్దతు తెలిపారు. అంగన్ వాడీల అంశాన్ని మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా అంగన్ వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రజా స్వామ్యంలో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం ప్రజల హక్కు అని చంద్రబాబు చెప్పారు. వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయి అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల కోసం సైకోతో పోరాడాల్సి వస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఆలయ భూములను సైతం వదలిపెట్టడంలేదని, యదేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.