40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

Update: 2023-03-28 12:13 GMT
40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేదు అని ఆరోపించారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవడం కోసం జీఓ నెంబర్1ను తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి 32 సభ్యులు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. పొలిట్ బ్యూరో సమావేశంలో 17అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్నికల సమయంలో తీసుకుంటామని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.

17 అంశాలపై చర్చ

మేనెలలో రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడును నిర్వహిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మహానాడు నిర్వహణకు సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అలాగే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. వీటితోపాటు వచ్చే ఎన్నికలకు టీడీపీ మ్యానిఫెస్టో పై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇకపోతే పొలిట్ బ్యూరో సమావేశంలో 17 అంశాలపై చర్చించినట్లు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వీటిలో 13 అంశాలు ఏపీకి చెందినవి కాగా 4 అంశాలు తెలంగాణకు చెందినవి అని స్పష్టం చేశారు. అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తీర్మానం చేశాం. పంట నష్టంపై సీఎం వైఎస్ జగన్ రివ్యూ కూడా చేయలేదు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ఒక స్వర్ణ యుగం. కానీ నేడు ఒక్క ప్రాజెక్టును జగన్ ప్రారంభించలేదు. ఏపీలో పన్నులు, కరెంటు చార్జీలు పెంచారు అని అచ్చె్న్నాయుడు విమర్శించారు.

రేపటితో టీడీపీ ఆవిర్భవించి 40ఏళ్లు పూర్తి

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఈనెల 29తో నలభై ఏళ్లు పూర్తి అవుతుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ ఆవిర్భావం జరగక ముందు ప్రజలు ఓటు వేసే యంత్రాలుగా ఉన్నారని.. దేశంలో సంక్షేమానికి నాంది పలికింది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 41 సంవత్సరాల్లో టీడీపీ చరిత్రను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలి అనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతి కుటుంబం ఆర్ధికంగా ఎదిగే వరకు టీడీపీ అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పార్టీలో కష్టపడిన వారికి అవకాశాలు ఇవ్వాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నట్లు అచ్చె్న్నాయుడు తెలిపారు.

యువతకు 40శాతం సీట్లు

వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకు ఇవ్వాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈనెల 30 నుండి మే నెల వరకు 100 సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో చర్చించినట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. కేంద్రం ప్రభుత్వం,మోడీని అభినందిస్తూ తీర్మానం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా 100 రూపాయల నాణెమును విడుదల చేయాలని మోడీ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఏపీలో ఓటు వేసి గెలిపించిన పట్టభద్ర ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏపీలో విజయవంతంగా సాగుతోంది అని టీడీపీ పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది.

పరిశ్రమలు తరలిపోతున్నాయి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో రూ. 10 లక్షల కోట్లు అప్పులు చేశారని పొలిట్ బ్యూరో ఆరోపించింది. అంతేకాదు 1 లక్షా 25 వేల కోట్లు పన్నులు వేశారు. 11 లక్షల 25 వేల కోట్లలో 1 లక్షా 85 వేల కోట్లు బటన్ నొక్కి డబ్బులు ఇస్తే మిగతా డబ్బులు ఎక్కడికి పోయాయి అని జగన్ ధన దాహానికి రాష్ట్రం నుండి పరిశ్రమలు వెళ్ళిపోయాయి. అమరరాజా, కియా అనుబంధ సంస్ధలు, జాకీ సంస్ధలు రాష్ట్రం నుంచి తరలివెళ్లిపోయాయి అని టీడీపీ పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఉద్యోగ సంఘాల నేతలు హక్కుల గురించి పోరాటం చేసేవారు నేడు జీతాల గురించి పోరాటం చేస్తున్నారు అని ఆరోపించారు. బాదుడే...బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతుంది. టీడీపీ సభ్యులకు రూ.5,000 శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీకి విరాళాలు ఇవ్వాలని టీడీపీ పొలిట్ బ్యూరో పిలుపునిచ్చింది.

పొత్తులపై అప్పుడే నిర్ణయం

2024 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలి అనే అంశంపై పొలిట్ బ్యూరోలో చర్చ జరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే మెజారిటీ సభ్యులు పొత్తులపై ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటే బెటర్‌ అని తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. ఇకపోతే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి చేరుతారనే అంశంపై తమకు ఎలాంటి సమాచారం లేదని అచ్చెన్నాయుడు చెప్పారు. టీడీపీలో చేరతామని కానీ.. టీడీపీకి మద్దతు పలుకుతున్నామని కానీ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశామని ఆ పార్టీ పదేపదే ఆరోపించడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. 2019 లో సైకిల్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను జగన్ ఎంత డబ్బులు ఇచ్చికొనుగోలు చేశారో చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి త్వరలో భారీ చేరికలు ఉంటాయని జోస్యం చెప్పారు. వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతామని సంప్రదింపులు జరుపుతున్నారని అచ్చెన్నాయుడు బాంబు పేల్చారు. మరోవైపు విభజన హామీల పరిష్కారం కోసం తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రయత్నం చేశాం అని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.

Tags:    

Similar News