Tdp-Janasena: దారుణంగా కొట్టుకుంటున్న కార్యకర్తలు.. ఇప్పుడే ఇలా అయితే ఎలా..!

ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. కానీ కొట్లాటలు మాత్రం ప్రారంభమయ్యాయి..

Update: 2023-11-16 14:25 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. కానీ కొట్లాటలు మాత్రం ప్రారంభమయ్యాయి. టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. అధినేతల స్నేహం బలపడింది. కానీ కార్యకర్తల సమన్వయ లోపం మాత్రం కనిపిస్తోంది. అంతేకాదు సీటు కోసం కొట్టుకుంటున్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ ఘర్షణకు దిగుతున్నారు. తీవ్ర గాయాలపాలు అయి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది కాకినాడ జిల్లాలో టీడీపీ, జనసేన కార్యకర్తల పరిస్థితి.


వచ్చే ఎన్నికలకు కలిసి కట్టుకట్టుగా వెళ్లాలని టీడీపీ, జనసేన అధినేతలు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలు సైతం ఒప్పుకున్నారు. ఇక కార్యకర్తల మధ్య సమన్వయానికి కుదర్చే పనిలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని, అప్పుడు అధికార పార్టీని ఢీకొట్టగలమని ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాకినాడ జిల్లాలో మాత్రం సీన్ రివర్స్‌గా ఉంది. జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో రెండు రోజలు క్రితం టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రెండు పార్టీల కార్యకర్తలను సమన్వయం చేసుందుకు మాజీ ఎమ్మెల్యే జోతుల నెహ్రూ, జనసేన ఇంచార్జి సూర్య చంద్ర ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అయితే సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఘర్షణగా మారి పరస్పరం కొట్టుకున్నారు. కుర్చీలు, జెండా కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో జనసేన కార్యకర్త కాలుకు తీవ్ర గాయం అయింది.


దీంతో జనసేన కార్యకర్తకు టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ ఇంచార్జి సూర్య చంద్ర డిమాండ్ చేశారు. కూర్చోబెట్టి మాట్లాడదామని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సారీ చెప్పాల్సిందేనని టీడీపీ నేతలతో సూర్య చంద్ర వాగ్వాదానికి దిగారు. దీంతో జ్యోతుల నెహ్రూ అసహనం వ్యక్తం చేశారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి గొడవులు చూడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు కుటుంబాల గొడవని కావాలనే రాజకీయం చేశారని మండిపడ్డారు. జగ్గంపేట నుంచి తానే పోటీ చేస్తానని చెప్పారు. అలా కాదని, జనసేన తరపున ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తానని స్పష్టం చేశారు. సూర్య చంద్రకు మాత్రం టికెట్ ఇస్తే తాను సపోర్ట్ చేయనని జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పారు.


దీంతో జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య సమన్వయం ఎలా కుదురుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన ఆశయాలకు ఆదిలోనే ఆటంకం కలుగుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎంతో స్నేహంగా ఉంటున్నా, కొన్ని చోట్ల కార్యకర్తలు మాత్రం ఇలా కొట్టుకోవడం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతోందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా టీడీపీ, జనసేన అధినేతలు కలుగ జేసుకుని ముందుగా కార్యకర్తలను సమన్వయం చేయాలని, లేదంటే రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అధినేతల ఆదేశాలకు పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. సమన్వయ సమావేశాల్లో కార్యకర్తలు ఆవేశాలకు పోకుండా శాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే సమస్య ఉండదని టీడీపీ, జనసేన పార్టీల్లోని సీనియర్ నేతలు అంటున్నారు. ఇలానే కొట్టుకుంటుంటే వైసీపీ నేతలు, కార్యకర్తలకు విమర్శల అవకాశం ఇచ్చినట్టవుతుందని హెచ్చరిస్తున్నారు. మరి రెండు పార్టీ కార్యకర్తలు ఎప్పటికీ తెలుసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News