AP News:పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు:జిల్లా కలెక్టర్
గురువారం జరగనున్న పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో హెచ్చరించారు.
దిశ,అమలాపురం: గురువారం జరగనున్న పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని, సంబంధిత ఆర్డీవోలను డీఎస్పీలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలలోని పాఠశాలల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎటువంటి గొడవలు లేకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 1581 ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలోని యాజమాన్య కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయని..ఎన్నికల్లో ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఓటు హక్కు వినియోగించుకొని కమిటీ సభ్యులను ఎన్నుకుంటారని, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నికైన కమిటీ సభ్యులు ఎన్నుకుంటారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు స్కూల్ యాజమాన్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని, అనంతరం స్కూల్ యాజమాన్య కమిటీల మొదటి సమావేశం జరుగుతుందని, అన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పాఠశాలలోనే ప్రధానోపాధ్యాయుని, ఆధ్వర్యంలో జరుగుతుందని, పంచాయతీ సెక్రటరీలు వీఆర్వోలు అబ్జర్వర్లుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.