వలంటీర్ ఉద్యోగాలపై YCP MLA సంచలన వ్యాఖ్యలు
వలంటీర్లు పడుతున్న కష్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళుతానని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. విడవలూరు మండలం వీరారెడ్డిపాళెంలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను ఆయన ఆస్మికంగా తనిఖీ చేశారు..
దిశ నెల్లూరు: వలంటీర్లు పడుతున్న కష్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళుతానని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. విడవలూరు మండలం వీరారెడ్డిపాళెంలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను ఆయన ఆస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలంటీర్లు చాలా కష్టపడుతున్నారన్నారు. వారి కష్టానికి నిజంగా ప్రతి ఫలం అందే విధంగా వారిని శాశ్వత ఉద్యోగస్తులుగా గుర్తించాలని సీఎం జగన్‌కి ప్రతిపాదన చేస్తానని చెప్పారు. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ముఖ్యమంత్రికి రెండు కళ్లు అని, ముందుచూపుతో ఈ వ్యవస్థలను తీసుకువచ్చారన్నారు. ఈ రెండు వ్యవస్థల వల్ల పేద ప్రజలకు త్వరగా సంక్షేమ పథకాల చేరుతున్నాయన్నారు. గ్రామాల్లో ప్రజల ఇంటి ముందుకే ప్రభుత్వ సేవలు అందే విధంగా ఈ రెండు వ్యవస్థలు పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రెండు వ్యవస్థల ద్వారా గ్రామస్వరాజ్యం ఏర్పడుతుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వస్తే సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తానని టీడీపీ నేతలు అనడం దారుణమన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫించన్లు తీసుకోవాలంటే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసేవారని, ఈ ప్రభుత్వంలో ఉదయానే వలంటీర్లు లబ్దిదారుల ఇంటి తలుపు తట్టి ఫించన్లు ఇస్తున్నారని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ, పాఠశాలలను పరిశీలించిన ఆయన మధ్యాహ్నా భోజనంపై ఆరా తీశారు. పాఠశాల్లో పిల్లలను తమ పిల్లలుగా భావించి నిర్వహకులు భోజనాన్ని తయారు చేయాలని, అలాగే ప్రతి రోజు ఉపాధ్యాయులు ఆ భోజనాన్ని పరిశీలించాలన్నారు. రెండవ నాడు–నేడు పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు కొన్ని అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటిని నిర్మించేందుకు స్థలాలను గుర్తించి త్వరగా నిధులు మంజూరు చేయిస్తామని ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు.