రెండేళ్ల కూతురిని కాలువలో పడేసిన తల్లి
కన్న పేగు కర్కశంగా మారింది. మాతృత్వానికి కళంకం తెస్తూ కన్న బిడ్డను కడతేర్చింది. విలాసవంతమైన జీవితం గడిపేందుకు చిన్నారి అడ్డుగా ఉందని కర్కశానికి పాల్పడింది.
దిశ, నెల్లూరు: కన్న పేగు కర్కశంగా మారింది. మాతృత్వానికి కళంకం తెస్తూ కన్న బిడ్డను కడతేర్చింది. విలాసవంతమైన జీవితం గడిపేందుకు చిన్నారి అడ్డుగా ఉందని కర్కశానికి పాల్పడింది. ఈ ఘటన నెల్లూరు బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నగరంలోని గుర్రాలమడుగు సంఘంలో కలుపూటి మణికంఠ, అనూష దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు కృతిక, చిన్న కూతురు లక్ష్మీ నిహారిక. మణికంఠ రాపూరులో ఓ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు నెల్లూరుకు వచ్చి భార్య, పిల్లలను చూసుకుని వెళుతుండేవారు. అనూష నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతోంది. భర్త పలుమార్లు అనూషను రాపూరుకు రావాలని కోరినా, వెళ్లకుండా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.
విలాసవంతమైన జీవితం కోసం
అనూష విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకునేది. భర్త మణికంఠకు విడాకులు ఇచ్చేసి పెద్ద కుమార్తె కృతికను తండ్రి వద్ద వదిలేసి, ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ గడపాలని ఆశించింది. ఈ క్రమంలో ఏడాదిన్నర వయసున్న చిన్న కుమార్తె తనకు అడ్డుగా ఉందని భావించి చంపేయాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు వెంకటగిరికి వెళ్లిన సమయంలో ఈ నెల మూడో తేదీ రాత్రి ఇంట్లో ఊయలలో నిద్రిస్తున్న చిన్న కుమార్తె లక్ష్మీ నిహారికను ఇంటి వెనుక ఉన్న సర్వేపల్లి కాలువలో పడేసింది. మరుసటి రోజు ఏమీ తెలియనట్లు కిడ్నాప్ డ్రామాకు తెర తీసింది. ఊయలలో నిద్రిస్తున్న కూతురును కిడ్నాప్ చేశారంటూ రోదించింది. స్థానికులు కూడా ఆమె మాటలు నమ్మి అయ్యో పాపం అని బాధపడ్డారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా.. కన్నతల్లి చేసిన ఘాతుకం బట్టబయలైంది. సర్వేపల్లి కాలువలో పడేసిన బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితురాలిని కటకటాల వెనక్కి పంపించారు.