రొట్టెల పండగకు భక్తుల రద్దీ.. దర్గాకు తొలి రోజు లక్ష మంది
నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ కొనసాగుతోంది. ..
దిశ, ప్రతినిధి నెల్లూరు: నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ కొనసాగుతోంది. తొలి రోజు బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ శర్మద ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు చేపట్టడంతో భక్తులందరూ సజావుగా దర్గాను దర్శించుకుని, రొట్టెలు మార్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. కోర్కెలు తీరిన వారు రొట్టెలను వదలడం... కోర్కెలతో వచ్చిన వారు ఆ రొట్టెలను స్వీకరించడం వంటి దృశ్యాలతో రొట్టెల పండగకు భక్తుల రద్దీ.. దర్గాకు తొలి రోజు లక్ష మందిస్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.
పటిష్ట బందోబస్తు
దర్గా ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, క్యూలైన్లు సజావుగా సాగేలా, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీస్ అవుట్ పోస్ట్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులను, వృద్ధులను వెంటనే సంబంధికులకు అప్పగిస్తున్నారు.
పారిశుద్ధ్య సిబ్బంది సేవలు భేష్
దర్గా పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తా చెదరాన్ని తొలగిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. దర్గా ప్రాంగణాన్ని ఏడు జోన్లుగా విభజించి పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం చేపడుతున్నారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు సెప్టిక్ ట్యాంక్ వాహనాల ద్వారా శుభ్రపరుస్తున్నారు. దీంతో దర్గా పరిసరాలు పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
వైద్య శిబిరాలను వినియోగించుకుంటున్న భక్తులు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలు భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రత్యేక వైద్యులను, సిబ్బందిని బ్యాచ్ ల వారీగా నియమించి 24 గంటలూ భక్తులకు వైద్య సేవలందిస్తున్నారు. మొదటిరోజు సుమారు 500 మంది పైగా భక్తులకు బిపి, రక్త పరీక్షలు, మందులు అందజేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెంచలయ్య తెలిపారు.
అప్రమత్తంగా అగ్నిమాపక శాఖ
స్వర్ణాల చెరువులో ఏ చిన్న ప్రమాదం జరగకుండా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. 24 గంటలూ అప్రమత్తంగా బోట్లు, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచారు. దర్గా ఆవరణలో అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచారు.
భక్తులందరికీ అన్నదానం
రొట్టెల పండుగకు విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచిత అన్నదానాన్ని వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నాలుగు అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు అందిస్తున్నారు. తొలిరోజు సుమారు 40 వేలకు మందికి పైగా భక్తులకు అన్నదానం చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే భక్తులకు స్వచ్ఛమైన తాగునీటిని స్టాల్స్ ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులు అందజేస్తున్నారు.
ప్రత్యేకంగా మీడియా పాయింట్
రొట్టెల పండుగ కవరేజ్ నిమిత్తం దర్గాకు విచ్చేస్తున్న మీడియా వారికి ప్రత్యేకంగా జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా పాయింట్ ను మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ఈ కేంద్రం నుంచి తమ విధులు నిర్వహిస్తూ రొట్టెల పండుగ విశేషాలను, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్నారు.