TDP: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ఆందోళనలు.. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్
విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు....
దిశ, ఏపీ బ్యూరో: విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కష్టాల్లో ఉన్న నిరుపేద, పేద, మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి భారం వేస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. తక్షణమే పెంచిన చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో యూనిట్‌కు రూపాయి ఉన్న విద్యుత్ చార్జీలను జగన్ నాలుగు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు పెంచి ప్రజలపై భారం మోపారని తెలిపారు. అలాగే వ్యవసాయానికి విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయడం రైతులపై భారం పెంచడమేనని అటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ప్రజలు కరోనా కష్టకాలంలో ఉన్నారని కూడా చూడకుండా విద్యుత్ చార్జీల పెంపుతో 17 వేల కోట్ల భారాన్ని మోపారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్థుల్ అజీజ్ మండిపడ్డారు. రాబోవు మే నెలలో యూనిట్‌కు 40 పైసల చొప్పున చార్జెస్ పెంచబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరు రూరల్, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గల విద్యుత్ కార్యాలయం ఎదురుగా అజీజ్ కార్యకర్తలతో కలిసి నిరసనలు తెలిపారు.