Somireddy: ఏపీలో బీహార్, యూపీ తరహా ఘటనలు
పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ గూండాలు జీపులెక్కి విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ..
- మహిళలు, పసిబిడ్డలు ఏడుస్తున్నా విధ్వంసం ఆపలేదు
- రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై కేంద్రం స్పందించాలి
- - మాజీ సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ గూండాలు జీపులెక్కి విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటన చూశాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అని అనుమానం కలుగుతోందని అన్నారు. అరాచకశక్తులు వచ్చే ప్రమాదం ఉందని ముందే తెలిసినా పోలీసులు నిర్లక్ష్యం వహించడంపై మండిపడ్డారు. కార్డన్ సెర్చ్ నిర్వహించి ఏం సాధించారో చెప్పాలని సోమిరెడ్డి ప్రశ్నించారు. జూలకంటి బ్రహ్మానంద రెడ్డి బలమైన నాయకత్వాన్ని జీర్ణించుకోలేకే వైసీపీ ఇలాంటి దాడులకు పురిగొలుపుతుందని ధ్వజమెత్తారు. యూపీ, బీహార్‌లలో అరాచకశక్తులను అణిచివేసి, అక్కడి ప్రభుత్వాలు ప్రశాంత వాతావరణం నెలకొల్పితే... అన్నపూర్ణలాంటి ఏపీలో మాత్రం ప్రభుత్వమే అరాచకాలను ప్రోత్సహించడం దురదృష్టకరమని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలు, పసిబిడ్డలు వంటిళ్లలో దాక్కొని ఏడుస్తున్నా ఆగకుండా విధ్వంసం కొనసాగించారని సోమిరెడ్డి చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఆటవిక పరిస్థితులను ఏపీలో చూడటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రేక్షకపాత్ర వహించడం తగదని కేంద్రానికి తగదని హితవు పలికారు. ప్రశాంత వాతావరణంలో పాలన సాగేలా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేశారు.