Nara lokesh: త్వరలోనే వైసీపీకి ఎండ్ కార్డ్.. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా ముత్తుకూరులో జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా ముత్తుకూరులో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో తనపై చాలా ఆరోపణలు చేశారని, ఒక్కటైనా నిరూపించారా అని లోకేశ్ ప్రశ్నించారు. యువగళం దెబ్బకు సైకో జగన్‌కు దిమ్మ తిరిగిపోతోందని విమర్శించారు. తనపై విమర్శలు చేసేందుకు మంత్రులు, మాజీ మంత్రులు పంపిస్తున్నారని మండిపడ్డారు. యువగళం బొమ్మ బ్లాక్ బస్టర్ అని వ్యాఖ్యానించారు. యువగళం దెబ్బకు త్వరలోనే వైసీపీకి ఎండ్ కార్డ్ అని ఎద్దేవా చేశారు. సైకో జగన్.. ఇంటింటికి ఒక సత్య నాదెళ్లను తయారు చేస్తానని చెప్పి ఊరికి ఒక అనంతబాబును తయారు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు.
సైకో జగన్‌కు బిల్డప్ తప్ప.. ఏమీలేదని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదన్నారు. దేశ చరిత్రలో 100 పథకాలు తీసేసిన సీఎంగా జగన్ రికార్డు సృష్టించారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.