Ap: మాజీ మంత్రికి మళ్లీ నోటీసులు.. అసలేం జరిగిందంటే..!
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు..

దిశ, వెబ్ డెస్క్: ఆ మంత్రిని పోలీసులు వదిలిపెట్టడంలేదు. విచారణకు రావాల్సిందేనని అంటున్నారు. అప్పటి వరకూ వెంటాడతామని చెబుతున్నారు. నోటీసులకు స్పందించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరో తెలుసా?.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy). ఈయన 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లి(Nellore District Sarvepalli) నుంచి గెలిచి రెండో సారి ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టారు. అయితే కాకాణికి వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ys Jagan) మంత్రి పదవి ఇచ్చారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అయింది. ఓ జైలులో ఫైల్ మిస్సింగ్ కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కేసును కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఈసారి ఓడిపోయారు. రాష్ట్రంలో అధికారం మారింది.
దీంతో అప్పటి నాయకులు చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం బయటకు తీసింది. ఇందులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. వైసీపీ హయాంలో మైనింగ్‌కు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు అందిన ఫిర్యాదుతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో కాకాణిని విచారించేందుకు నెల్లూరు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయనకు నోటీసులు ఇస్తున్నారు. నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు.. అక్కడ ఎవరూ లేకపోవడం, వాళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఈ విచారణకు కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ కూడా ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. దీంతో పోలీసు విచారణకు కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ కేసుపై ఆయన ఇప్పటికి వరకూ స్పందించలేదు. ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు. ఎవరికీ అందుబాటులో లేరు. మరి పోలీస్ కేసుపై కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యూహం ఏంటి అనేది చూడాల్సి ఉంది.