Gudur: తమ్మినపట్నం వాసులకు నారా లోకేశ్ సంచలన హామీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తమ్మినపట్నంలో జరిగింది. ...

Update: 2023-06-30 17:24 GMT

దిశ, గూడూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తమ్మినపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా తమ్మినపట్నం గ్రామస్తులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అయితే ఈ గ్రామంలోని హరిజనవాడలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కోదండరామస్వామి దేవస్థానం భూమిలో దళితులు, గిరిజనులు 100 ఏళ్లకు పైగా నివాసముంటున్నారు. కృష్ణపట్నం పోర్టు నిర్మాణం కోసం 375 ఎకరాలు తీసుకుని ఆ గ్రామం చుట్టూ ప్రహరీ కట్టారు. కానీ ఎటువంటి ఇళ్ల స్థలాలు గానీ, ఇంటి పట్టాలు గాని ఇవ్వలేదు. దీంతో ఇంటి పట్టాలు ఇవ్వాలని అధికారులకు గ్రామస్తులు చాలాసార్లు ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకోలేదు.

ఇక పోర్టు నిర్మాణ సమయంలో నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ కింద దళితులు, గిరిజనులకు రూ.75వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, ప్రతి ఇంటికీ రూ.13,500 మాత్రమే ఇచ్చారు. 2019 తర్వాత ఇంటి పట్టాలు, ప్యాకేజీ‌పై అధికారులు పట్టించుకోలేదు. దీంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనలో తమ ముఖం కూడా చూసే వారు లేరని వాపోయారు. ఈ మేరకు నారా లోకేశ్‌కు వినతి పత్రం అందజేశారు. తమరు అధికారంలోకి వచ్చిన తర్వాతైనా సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ ప్రధానమైన పరిశ్రమలు, పోర్టుల నిర్మాణ సమయంలో నిర్వాసితులకు పునరావాసం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. తమ్మినపట్నం గ్రామస్తులకు పునారావసం, పరిహారంపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ్మినపట్నం గ్రామస్తులకు ఇళ్లస్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పోర్టు యాజమాన్యంతో మాట్లాడి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని నారా లోకేశ్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News