Tribal Communities: మా గొంతు కొస్తున్నారు..
బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దంటూ నెల్లూరు జిల్లా గిరిజన సంఘాల ఐక్యవేదిక నిరసన ప్రదర్శన చేపట్టింది..
దిశ, డైనమిక్ బ్యూరో: బోయ/వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దంటూ నెల్లూరు జిల్లా గిరిజన సంఘాల ఐక్యవేదిక నిరసన ప్రదర్శన చేపట్టింది. అర్ధనగ్న ప్రదర్శనలతో ర్యాలీగా వెళ్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కేసీ పెంచలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయలను ఎస్టీ జాబితాలే చేర్చడమంటే గిరిజనుల గొంతు కోయడమేనని అన్నారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ నెల్లూరు వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి గిరిజన వేషధారణతో వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కలెక్టరేట్ వరకూ ర్యాలీగా వెళ్లి ఏవోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కేసీ పెంచలయ్య మాట్లాడుతూ 40 లక్షల జనాభా ఉన్న బోయలను 32 లక్షల జనాభా ఉన్న గిరిజన జాబితాలో చేర్చడం ఏమిటని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు లేని అన్ని విధాలా అభివృద్ది చెందిన బోయలను ఎస్టీ జాబితాలో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే గిరిజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మే నెలలో ఛలో ఢిల్లీకి పిలుపునిస్తున్నట్లు గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ కేసీ పెంచలయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోట్లూరు శ్రీనివాసులు, మాకాని వెంకటేశ్వర్లు, ఇండ్ల రవి, పుత్తూరు శ్రీనివాసరావు, తిరివీధి సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.