Nellore రెడ్లకు అనిల్ కుమార్ చెక్ పెట్టగలరా?

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ప్రధానంగా రెడ్లే రాజ‌కీయ నేత‌లుగా ఉన్నారు. ద‌శాబ్దాలుగా పార్టీ ఏదైనా నెల్లూరు రాజ‌కీయంలో రెడ్లు అంతా తామై న‌డిపిస్తున్నారు. ..

Update: 2022-12-12 12:23 GMT

దిశ, నెల్లూరు: నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ప్రధానంగా రెడ్లే రాజ‌కీయ నేత‌లుగా ఉన్నారు. ద‌శాబ్దాలుగా పార్టీ ఏదైనా నెల్లూరు రాజ‌కీయంలో రెడ్లు అంతా తామై న‌డిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజికవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో రెడ్లే ఎమ్మెల్యేలుగా ఎన్నికైయ్యారు. గూడూరు నెల్లూరు సిటీ సూళ్లూరు పేట నియోజికవర్గాలకు మాత్రమే ఇతర సామాజికవర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అలాగే పార్టీలోని ప్రధాన పదవుల్లో కూడా రెడ్ల ఆధిపత్యం ఉంది. వారితో సరైనా ఈక్వేషన్ లేని బీసీ నేత అనిల్. రెడ్ల ఆధిపత్యాన్ని ఏవిధంగా ఎదుర్కుంటారన్నది ఇప్పడు నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. నెల్లూరు సిటీ టికెట్ ఈసారి రెడ్లకే కేటాయిస్తారన్న టాక్‌ కూడా వినిపిస్తుంది. ఈసారి రెడ్లకు చెక్ పెట్టేందుకు అంతర్గతంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అనిల్ నేరుగా ఎవరినీ విమర్శించడం లేదు. కానీ రెడ్లకు వ్యతిరేకంగా ఉన్న బీసీలకు మాత్రం అనిల్ మద్దతు ఉందనే ప్రచారం సాగుతోంది.

అభివృద్ధినే నమ్ముకున్న అనిల్

గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరును అనిల్ అభివృద్ధి చేశారు. ఎళ్ళ తరబటి పెండింగ్‌లో ఉన్న సర్వేపల్లి కాలువ, పెన్నా బ్యారేజ్ పనులను పూర్తి చేయగలిగారు. నియోజకవర్గంలోని ముఖ్య సమస్యలను పరిష్కరించారు. గతంలో మాజీ మంత్రి నారాయణ చేసిన అభివృద్ధి కంటే అనిల్ ఎక్కువ అభివృద్ధి చేశారనే టాక్‌ ప్రజల్లో కూడా వినిపిస్తుంది. అలాగే తనను నమ్మకున్న పార్టీలోని నాయకులకు అందుబాటులో ఉంటూ వారిని పక్క పార్టీల వైపు వెళ్లకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. వ్యవహాత్మకంగా జనాల్లోకి వెళ్తూ, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మారుతున్న సమీకరణలు

నగర రాజకీయ పరిణాలు రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్నటి వరకు నెల్లూరు సిటీలో టీడీపీ పుంజుకుంటుందని అంతా భావించినా నేడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పని తీరుతో సమీకరణలు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న అనిల్ తనపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గడగపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ప్రజల సమస్యలను వింటూ అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులను ఆదేశిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నా ఇప్పుడు దానిని సమన్వయం చేసుకుంటూ అనిల్ ప్రజల్లో మమేకమవుతున్నారు.

అనిల్ ఒంటరి పోరు

మంత్రివర్గ విస్తరణ తరువాత నెల్లూరు వైసీపీలో అసమ్మతి జ్వాలలు వినిపించాయి. మాజీ మంత్రి అనిల్, మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ నడిచింది. ఇందులో భాగంగానే ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. దీంతో వారు తీవ్ర స్థాయిలో బాహాటంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డితో కూడా అనిల్‌కు విభేదాలు ఉన్నాయి. నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని..మాఫియాలు, కబ్జాలు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువైపోయారని అనిల్‌ను ఉద్దేశిస్తూ ఆనం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇలా నెల్లూరు జిల్లాలోని ముఖ్య నేతలతో విభేదాల కారణంగా అనిల్‌‌కు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఇలా ఒంటరివాడై పార్టీ నేతల నుంచి సహకారంలేని అనిల్ వచ్చే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది

అనిల్‌‌కు తప్పని ఇంటిపోరు

అనిల్‌కుమార్‌ యాదవ్‌కు వరసకు బాబాయ్ అయిన రూప్ కుమార్ యాదవ్‌తో ఇంటిపోరు తప్పలేదు. ఆయన ప్రస్తుతం డిప్యూటీ మేయ‌ర్‌గా ఉన్నారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అనిల్ మంత్రి అయ్యాక ఎక్కువగా రాజ‌ధాని అమ‌రావ‌తితో పాటు ఇత‌ర జిల్లాల్లో ప‌ర్యటించాల్సి వ‌చ్చేది. నియోజ‌క‌వ‌ర్గ బాధ్యతలన్నీ రూప్ కుమార్ చూసుకున్నారు. అంతేకాదు అనిల్‌కు సంబంధించిన అన్ని రాజకీయ వ్యవహారాలను రూప్ చక్కబెట్టేవారు. ఈ నేపథ్యంలో రూప్ కుమార్ తన పేరును ఉపయోగించి అవినీతికి పాల్పడి చెడ్డపేరు తెస్తున్నారని, అందుకే అనిల్ రూప్ కూమార్‌ను దూరం పెట్టినట్టు సమాచారం.. రూప్ కుమార్ అనిల్‌కు దూరం కావడంతో పార్టీ క్యాడర్‌లో చీలికలు ఏర్పడ్డాయి. దీంతో అనిల్ ప్రాబల్యం కొంత తగ్గిందన్న టాక్ వినిపిస్తుంది. మరి నెల్లూరు రెడ్లపై ఏ విధంగా పై చేయి సాధిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి : I-PAC Rayalaseema Survey: అధికార పార్టీ గెలుపుపై సంచలన విషయాలు

Tags:    

Similar News