Sports quota : దేశంలోనే ఏపీలో స్పోర్ట్స్ కోటా అధికం..సీఎం చంద్రబాబుకు పాలాభిషేకాలు
ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్య, ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా(Sports quota)ను దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో 2 శాతం నుండి 3 శాతానికి పెంచడం పట్ల క్రీడాకారుల్లో, విద్యార్థుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్య, ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా(Sports quota)ను దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో 2 శాతం నుండి 3 శాతానికి పెంచడం పట్ల క్రీడాకారుల్లో, విద్యార్థుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్పోర్ట్స్ కోటా పెంపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి విద్యార్థులు, క్రీడాకారులు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఒలంపిక్ అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలోనే ఏపీలో 3శాతం స్పోర్ట్స్ కోటా అందించనుండటం ద్వారా చంద్రబాబు రాష్ట్రంలో క్రీడా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. విద్యార్థులు ఇక మీదట భవిష్యత్తుపై గట్టి భరోసాతో క్రీడల్లో రాణించేందుకు ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఏపీ కొత్తగా తీసుకువస్తున్న స్పోర్ట్స్ పాలసీ విధానంలో భాగంగా స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ 2 నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. శాప్‌లో గ్రేడ్ 3 కోచ్‌ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 లక్షలు ఇస్తుండగా.. దానిని రూ.7 కోట్లకు పెంచారు. రజత పతకానికి రూ.50 లక్షలు నుంచి రూ.5 కోట్లు, కాంస్యానికి రూ.30 లక్షల నుంచి రూ.3 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒలింపిక్స్‌లో పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. ఏషియన్ గేమ్స్ బంగారు పతకానికి రూ.4 కోట్లు, రజత పతకానికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి, పాల్గొన్న వారికి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇస్తారు. అదే విధంగా వరల్డ్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతానికి రూ.35 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతానికి రూ.5 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు.. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.