Sea Plane: నేడు సీ ప్లేన్ ప్రారంభం.. దాని ప్రత్యేకతలు తెలుసా?

విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్లు విహరించనున్నాయి. రాష్ట్ర పర్యాటకం, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధే లక్ష్యంగా ప్రారంభిస్తున్న ఈ సీ ప్లేన్ల టికెట్ ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు.

Update: 2024-11-09 04:13 GMT

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ చరిత్రలో.. పర్యాటకరంగంలో మరో అడుగు ముందుకు వేయనుంది ఏపీ ప్రభుత్వం. దేశంలోనే తొలిసారిగా సీ ప్లేన్ ను ఏపీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానుంది. మాల్దీవుల్లో కనిపించే సీ ప్లేన్.. ఇకపై మన ఆంధ్రప్రదేశ్ లో కనిపించనున్నాయి. నేడు.. సీఎం చంద్రబాబు (Chandrababu), కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu), ఇతర అధికారులు కలిసి విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్ (Sea Plane) ను ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి సీ ప్లేన్ లోనే శ్రీశైలంకు చేరుకుని అక్కడ మల్లన్నను దర్శనం చేసుకుని, తిరిగి విజయవాడకు రానున్నారు చంద్రబాబు. నిన్ననే సీ ప్లేన్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ఈ ట్రయల్ రన్ ను నిర్వహించారు.

సీ ప్లేన్ ప్రత్యేకతలు

డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ సీ ప్లేన్ ను తయారు చేసింది. మొత్తం 14 సీ ప్లేన్లు విజయవాడ - శ్రీశైలం మధ్య ఇవి నీటిపై ప్రయాణించనున్నాయి. టెంపుల్ టూరిజంను, రాష్ట్రంలో వైమానిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ సీ ప్లేన్ ను తీసుకొస్తుంది. సీ ప్లేన్ లో ఒక్కో టికెట్ ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది.

సీ ప్లేన్ 1500 అడుగుల ఎత్తులో 150 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. మొత్తం 30 నిమిషాల పాటు సీ ప్లేన్ ప్రయాణిస్తుంది. ఇందులో టేకాఫ్, ల్యాండింగ్ కు 10 నిమిషాల సమయం పడుతుంది. ఇవి రెండూ నీటిపైనే జరుగుతాయి. రన్ వే అవసరం ఉండదు. 20 నిమిషాల పాటు ఆకాశంలో విహరిస్తుంది. సీ ప్లేన్ లో ప్రయాణించేవారు.. ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకూ.. నీటి అందాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు.. అతి తక్కువ సమయంలోనే శ్రీశైలం మల్లన్నను కూడా దర్శించుకునే వెసులుబాటు ఉంటుంది. 

Tags:    

Similar News